గుంటూరు వెస్ట్‌లో మారిన ప‌వ‌నాలు... ఎవ‌రివైపు సానుకూలం..?

RAMAKRISHNA S.S.
రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు వెస్ట్‌. ఇక్క‌డ నుంచి మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ.. వైసీపీ నుంచి బ‌రిలో నిలిచారు. టీడీపీ నుంచి తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేసిన‌.. గ‌ల్లా మాధ‌వి పోటీలో ఉన్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌రిస్థితులు అటు ఇటుగా ఉన్నాయి. ఎవ‌రు గెలిచినా.. పెద్ద‌గా మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌లేద‌నే టాక్ ఉంది. అయితే.. ఇప్ప‌టికీ ఇలానే ఉన్నా.. కొంత మార్పు అయితే క‌నిపిస్తోంది.

స‌మ‌న్వ‌యం-సానుకూల స్పంద‌న వంటివి వైసీపికి ఇక్క‌డ మేలు చేస్తున్నాయ‌ని చెబుతున్నారు ప‌రిశీల కులు. నిన్న మొన్న‌టి వ‌రకు అలిగిన నాయ‌కుల‌ను, పార్టీ టికెట్ ఆశించిభంగ ప‌డిన వారిని.. ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు.. విడ‌ద‌ల ర‌జ‌నీ ప్ర‌స‌న్నం చేసుకున్నారు. వారిని త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో వారిని కూడా.. త‌మ‌వైపు తిప్పుకొన్నారు. మైనారిటీ సంఘాలు విడ‌ద‌ల ర‌జ‌నీకి జై కొట్టాయి.

అదేవిధంగా వైసీపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోను కూడార‌జ‌నీ క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా తీసుకువెళ్లారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రికీ వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిలో భారీ అంచ‌నాలు లేక‌పోయినా.. ప్ర‌జ‌లు మేలు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న‌.. భావ‌న‌ను మాత్రం ప్ర‌జ‌ల‌కు క‌లిగించారు. దీంతో విడ‌ద‌ల ర‌జ‌నీ వైపు కొంత వ‌ర‌కు ప‌వ‌నాలు సానుకూలంగా మారాయ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, మ‌రోవైపు.. టీడీపీ నుంచి పోటీలో ఉన్న గ‌ల్లా మాధ‌వికి.. సొంత వ‌ర్గంలోనే సెగ‌లు పుడుతున్నాయి.

ఎవ‌రినీ సంప్రదించ‌కుండానే.. చంద్ర‌బాబు ఏక‌ప‌క్షంగా ఆమెను ఎంపిక చేశార‌న్న వాద‌న ఆది నుంచి ఉంది. ఇక‌, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి పార్టీల నాయ‌కుల‌ను క‌లుపుకొని వెళ్ల‌డంలోనూ.. మాధ‌వి వెనుక‌బ డ్డారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆమెకుఅనుభ‌వం లేక‌పోవ‌డ‌మే. పోనీ.. సీనియ‌ర్ నాయ‌కులు అయినా.. బ‌రిలో ఉండి.. ప్లాన్ చేస్తున్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో మాధ‌వికి ముందున్న హుషారు.. ఎన్నిక‌ల పోలింగ్ స‌మీపించే స‌రికి చ‌ప్ప‌బ‌డింది.

పైగా.. ఈ సీటు ఆశించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ సైలంట్ అయిపోయారు. ప్రస్తుతం బయటకు రావడం లేదు. జనసేన కార్యకర్తలను ఒకచోటుకి పిలవడం, వారితో మీటింగులు పెట్టడం ఏమీ చేయడం లేదు. అంతా నిర్లిప్తంగా నడిపిస్తున్నారు. అలాగే వైసీపీ మీద మాట్లాడితే ఒంటికాలి మీద లేచే బోనబోయిన ఇప్పుడు ఫుల్లు సైలెంట్ అయిపోయారు. ఇది కూడా మాధ‌వికి ఇబ్బందిగా మారింది.

మరోవైపు బీజేపీ నేత, జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న వల్లూరి జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఈయ‌న కూడా స్థానికంగా ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోతున్నారు. ఫ‌లితంగా.. ఇప్పుడు మాధ‌వి కొంత మేరకు ఎదురీత‌లోఉన్నార‌నే చెప్పాలి. అయితే.. పోటీ మాత్రం తీవ్రంగానే ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఎవ‌రు గెలిచినా.. స్వ‌ల్ప మెజారిటీతోనే బ‌య‌ట ప‌డ‌తార‌ని ప‌రిశీల‌కులు లెక్క‌లు క‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: