భోగి -చుక్కల ముగ్గుల ప్రాధాన్యం ఏంటో తెలుసుకోవాలని ఉందా !!!!

Kumar Vinod

మన తెలుగు వారి పెద్ద పండుగ మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. మూడు రోజుల పాటు జరిగే పండుగలో మొదటి రోజు 'భోగి'. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు' అనే అర్ధం ఉంది. అనగా పండుగ తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం.దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు.

 

భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు. ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున లేచి భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు. 'భగ' అనే పదం నుంచి  భోగి అన్నమాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం.

 

సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకువచ్చేది ముగ్గులు.. ఇంటి చుట్టూ ముగ్గులు వేస్తారు.. రంగులతో అలంకరిస్తారు.. అసలు ఈ ముగ్గు ప్రాముఖ్యత ఏంటో చూద్దాం... పైనున్న నక్షత్రాలకు కింద ఉన్న ముగ్గులు ప్రాముఖ్యత ఉంది.. నక్షత్ర మండలాన్ని చూపిస్తూ చుక్కలని పేరుస్తారు. చుక్కలని కలువుతూ వేసే ముగ్గుల ద్వారా నక్షత్ర మండలానికి ప్రాధాన్యత వస్తుంది.. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం.

 

చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌),చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా చెప్పచ్చు.

 


మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు... చిన్నపుడు పిల్లలు ముగ్గులు వేస్తూ నాకు రధం ఊరంతా తిరుగుతుంది అని రధం చివర ఒక పెద్ద తాడు గీసేవారు ముగ్గుతో గుర్తువచ్చిందా !!!!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: