61 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి దివ్యమంగళ స్వరూపం

NAGARJUNA NAKKA
గణేష్ నవరాత్రులు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే. దీనికి కారణం భారీ ఆకారం, విగ్రహం ఎత్తే. గతేడాది 57 అడుగులున్న ఖైరతబాద్ వినాయకుడు ఈసారి 61 అడుగులకి పెరిగాడు. ఈ ఏడాది గణనాథుడి విగ్రహం ఎలా ఉంటుందా అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


వక్రతుండ మహాకాయుడు..కోటి సూర్యుల సమప్రభతో.. ఏటా ఖైరతాబాద్ లో భారీ రూపంలో కొలువుతీరుతున్నాడు.. 61 అడుగుల ఎత్తుతో.. విరాట్  స్వరూపంలో విగ్రహాన్ని తీర్చిదిద్దడం అంత సులువు కాదు. వినాయకుడు అనగానే అందరి మదిలో మెదిలేది నిలువెత్తు రూపం. ఆకాశమంత ఎత్తుతో కనిపించే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే సకల విఘ్నాలు తొలగిపోయిన అనుభూతి కలుగుతుంది. ఆ గౌరీపుత్రుడి దర్శనభాగ్యం కోసం కొన్ని లక్షలమంది ఏకధాటిగా 11 రోజులపాటు ఖైరతాబాద్ కు పోటెత్తుతారు. లంబోదరుడి దివ్యస్వరూపాన్ని చూసి అచ్చెరువొందుతారు. మనసారా గౌరీపుత్రుడిని దర్శించుకుని, భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్ లోనే కాకుండా  దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. 


ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేశుడు భిన్నమైన రూపంలో కనిపించబోతున్నాడు. 60 ఏళ్లుగా, 60 రూపాల్లో దర్శనమిచ్చిన లంబోదరుడు ఈ సంవత్సరం ద్వాదశాదిత్య మహాగణపతిగా భక్తులను ఆశీర్వదించబోతున్నాడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తులో సూర్యభగవానుడి రూపంలో కటాక్షించబోతున్నాడు. ఎందుకంటే ఈ ఏడాది  ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఆదిత్యుడు శాంతించాలని ద్వాదశాదిత్య రూపాన్ని తీసుకున్నారు. గతేడాది 57 అడుగులున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి 61 అడుగులకు పెరిగాడు. 12 శిరస్సులు, 24 హస్తాలు, 12 ఆదిశేషువులు, ఏడు అశ్వాలతో కొలువుదీరుతున్న వినాయకుడికి.. ఎడమవైపున దత్రాత్రేయుడు, కామధేనువు సిద్ధకుంజికాదేవీ ఉంటారు. కుడివైపు ఏకాదశిదేవి, మహావిష్ణువు రూపం దర్శనమిస్తుంది. 


ఏప్రిల్ 30న కర్రపూజ జరిగిన అనంతరం, జూన్ మొదటి వారంలో  షెడ్ వర్క్ చేశారు. అది ఒక్కపక్క జరుగుతుంటేనే, ఇంకోవైపు వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. వెంటనే చెన్నయ్ నుంచి ఆర్టిస్టులు వచ్చి  క్లేవర్క్ స్టార్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన కళాకారులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు చేశారు. బీహార్, బెంగాల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు విగ్రహాలకు మెరుగులు దిద్దారు. హైదరాబాద్ వర్కర్లు మౌల్డింగ్ పనులు చేశారు. పండుగ దగ్గరపడటంతో విగ్రహ తయారీ దాదాపు పూర్తయింది. భారీ గణనాథుడి విగ్రహం తయారీకి సుమారు 150 మంది కళాకారులు పనిచేశారు. వాళ్లంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చిన వారెవరూ లాభాపేక్షతో కాకుండా భక్తితో, చిత్తశుద్ధితో పనిచేశారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేయాలనేది ప్రతీ కళాకారుడి స్వప్నం. ఆ అదృష్టం కలగాలని ప్రతీ ఆర్టిస్టూ కోరుకుంటారు. అలాంటి వారికి తప్పకుండా అవకాశం ఇస్తామంటున్నారు స్తపతి రాజేంద్రన్. 


గణేష్ విగ్రహం నెలకొల్పి 2013 నాటికి 59 ఏళ్లు అయ్యింది. దీంతో 2013లో 59 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. 2014లో విగ్రహం ఎత్తు 60 అడుగులకు చేరింది. గణనాథుడి విగ్రహం తరలింపు, నిమజ్జనం విషయంలో సమస్యలు రావడంతో.. విగ్రహం ఎత్తు తగ్గించాలని నిర్వాహాకులు నిర్ణయించారు. 2018లో శ్రీ సప్త ముఖ గణేషుడి విగ్రహం ఎత్తు 55 అడుగులే. ఈ ఏడాది మాత్రం 61 అడుగుల ఎత్తుతో విగ్రహం తయారు చేశారు. 11 రోజులపాటు దేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: