పూర్వాభాద్ర 4వ పాదము లేదా ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు లేదా రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.
శ్రీ వికారి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 01 అవమానం - 07. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "1". ఇది ఆర్ధిక విషయాలలో లాభాన్ని సూచించుచున్నది.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) అన్ని విధములా కలసి వచ్చును. ఆర్ధికంగా, వ్యక్తిగత జీవన పరంగా , వృత్తి పరంగా అన్ని విధాల అనుకూలంగా ఉండును. తలచిన పనులన్నీ విజయవంతమగు గ్రహ ఫలితములు కలవు. ముఖ్యంగా గురు గ్రహం వలన మిక్కిలి యోగవంతమైన కాలాన్ని ఏర్పరచును. భూ సంబంధ లాభాలను, వారసత్వ లేదా జీవిత భాగస్వామి సంబంధిత భాగ్యమును, స్వార్జిత ధన సంపదలను ఏర్పరచును. అందరూ మెచ్చే విధంగా సంస్కారాన్ని ప్రసాదించును. చెడు వ్యసనాలనుండి బయటపడు పరిస్థితులను ఏర్పరచును. నిరుద్యోగులకు అతి చక్కటి ఉద్యోగ జీవనాన్ని ప్రసాదించును. ప్రమోషన్లు, సత్కారములను ఏర్పరచును.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని కూడా సంవత్సరం అంతా విశేష ధనలాభములను , నూతన ఆదాయ మార్గములను ప్రసాదించును. ఆర్ధికంగా లోభత్వం ప్రదర్శించుట వలన కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పరచును. ముఖ్యంగా 24-జనవరి-2020 నుండి ఆర్ధికాభివృద్ధి చాలా వేగంగా ఉండును.
మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన మాతృ వర్గీయుల వలన లాభములను, మాత్రువర్గీయుల సహకారమును, బంధువర్గ సౌఖ్యమును, వాహన సౌఖ్యమును, విధ్యార్ధులకు అతి చక్కటి విద్యా ఫలితములను కలుగచేయును. పారమార్ధిక చింతను అలవరచును.
ఏప్రిల్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో అతి చక్కటి గ్రహ బలములు ఏర్పడివున్నవి. ఆశించిన పనులు విజయవంతమగును. ధనాదాయం వృద్ధి చెందును. తలపెట్టిన ప్రయాణాలు లాభవంతమగును. ఉద్యోగ జీవనంలో స్థాయి పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగం లభించును. అనారోగ్య సమస్యలు తగ్గును. వాయిదా పడుతున్న పనులను పూర్తీ చేయగలరు. వివాదాలను స్వయంగా పరిష్కరించుకుంటారు. రాజకీయాలపట్ల ఆకర్షితులవుతారు. వ్యాపారాదులు సక్రమంగా కొనసాగును. ఆర్ధిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది.
మే 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కూడా క్రిందటి మాసం వలె అతి చక్కటి శుభ ఫలితాలు కొనసాగును. ప్రముఖులతో పరిచయాలు పెరుగును. స్థిరాస్థి లావాదేవీలలో అదృష్టం కలసివచ్చును. ఇతరుల మనసు తెలుసుకొని పనులను పుర్తిచేయగలుగుతారు. ఉద్యోగులకు కృషికి తగిన గుర్తింపు , ప్రజాదరణ అందుకుంటారు. 17 నుండి 23 వ తేదీల మధ్య తీరికలేకుండా శారీరక శ్రమ చేయవలసి వచ్చును. పై అధికారుల సహకారంతో ముఖ్యమైన పనులలో నైపుణ్యత సాధిస్తారు. అవసరమైన వనరులు సకాలంలో లభిస్తాయి. ఈ మాసంలో 5, 8 వ తేదీలలో ఆర్ధిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను.
జూన్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఇతరుల మాటలు నమ్మి నూతన వ్యవహారాలు ప్రారంభించకపోవడం మంచిది. గృహంలో అతిధుల సందడి అధికమగును. ఉత్సాహపూరిత వాతావరణం. విద్యా , వ్యాపారాదులు ఆశించిన విధంగా కొనసాగును. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు తగ్గును. సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. చివరి వారంలో వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తీ చేసుకుంటారు.
జూలై 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు, స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి లాభాలు సిద్ధించును. విదేశీ వ్యవహారాలలో మాత్రం ఆటంకాలు ఎదురగును. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు ఇది మంచి మాసం. నూతన ఆదాయ మార్గాల కొరకు చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. క్రొత్త ఆలోచనలు కార్య రూపం దాల్చును. బంధువుల, స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడును. పరిస్థితులకు తగిన విధంగా మీ ఆలోచనా విధానం మార్చుకొందురు. నూతన పదవులు లభించడానికి గ్రహ బాలలు ఉన్నవి. తృతీయ , చతుర్ధ వారాలలో శుభాకార్యములందు లేదా కుటుంబములో కులాసాగా గడుపుతారు. సోదరి వర్గానికి మీ సలహాలు - ఆర్ధిక సహకారం అవసరమగును.
ఆగష్టు 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో బాధ్యతలు పెరిగినప్పటికీ బాధ్యతలన్నిటినీ ఎటువంటి విఘాతం లేకుండా పూర్తీ చేయగలరు. ఆధ్యాత్మిక వేత్తల పరిచయ భాగ్యం ఏర్పడును. ధనాదాయం సామాన్యం. మాతృ వర్గీయులతో చిన్న సమస్య ఏర్పడవచ్చును. ద్వితీయ , తృతీయ వారాలలో దీర్ఘకాలిక కోరికలను నేరవేర్చుకోగలరు. కావలసిన సౌకర్యాలు సాధించుకొందురు. మాసాంతంలో విందు-వినోదాలలో సంతృప్తికర ఆహరం. ఈ మాసంలో 2 వ తేదీ నుండి 8 వ తేదీ మధ్యకాలం వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైనది.
సెప్టెంబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలలో మార్పులు శుభప్రదంగా ఉంటాయి. ఆశించినంత ధనాదాయం పొందుతారు. అన్ని అడ్డంకులు తొలగించుకొని గృహారంభ పనులు చేపడతారు. లేదా గృహానికి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన మిత్ర వర్గం ఏర్పడును. మార్కెటింగ్ రంగంలోని వారికీ శారీరక శ్రమ అధికమగు సూచనలు కలవు. గృహ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. తృతీయ వారమంతా ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. చివరి వారంలో 22 వ తేదీ నుండి మాసంతం వరకూ నూతన పెట్టుబడులు పెట్టుటకు అనువైన గ్రహ బాలలు కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన అధికారాలు ప్రాప్తించును.
అక్టోబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో వైవాహిక జీవన సమస్యలు తొలగును. వివాహ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవనంలో సంతోషాలు పొందేదురు. ప్రవాస జీవన ప్రయత్నాలకు విఘ్నాలు తొలగును. విదేశీయానం ఫలవంతమగును. వ్యాపారాదులు సక్రమంగా నడచును. నూతన వాహనం ఆశించిన కోరిక సిద్ధించును. సంతానం పట్ల శ్రద్ధ వహించవలెను. వారి ఆర్ధిక సంబంధ ప్రవర్తన కొద్దిపాటి ఆందోళన కలుగచేయును.
నవంబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో సమాజంలో నూతన పరిచయాలు ఏర్పడును. సమాజంలో తగిన గౌరవం లభించును. వ్యాపార రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తారు. వ్యాపార అభివృద్ధి పనులు చేపడతారు. హస్తకళా రంగంలోని వారికి అతి చక్కటి కాలం. నూతన ఒప్పందాలు లభించి సంతృప్తికర జీవనాన్ని పొందుతారు. ఈ మాసంలో 13 నుండి 17 వ తేదీ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు కలవు. చివరి వారంలో అనుమానాలు ఎక్కువ ఉండుట వలన కొద్దిపాటి మానసిక అశాంతి. ఇతరులతో మాట్లాడునపుడు జాగ్రత్త వహించవలెను.
డిసెంబర్ 2019 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో కొద్దిపాటి అననుకూల ఫలితాలు ఏర్పడు సూచన. వృత్తి ఉద్యోగాలలో వ్యతిరేక పరిస్థితులు ఉన్నవి. ఆదాయం కూడా ఆశించినంతగా ఉండదు. వైవాహిక జీవనంలో చికాకులు, కోర్టు తగాదాలు, శత్రు సమస్యలు. ఈ మాసం నూతన వ్యవహారదులకు అంతగా అనుకూలమైనది కాదు. కుటుంబంలో గౌరవ అభిమానములు స్వయంకృతాపరాధం వలన తగ్గును. దేవాలయ దర్శనం ద్వారా మానసిక శాంతిని పొందగలరు. ఈ మాసంలో 3, 6, 8, 10, 19, 26 తేదీలు అనుకూలమైనవి కావు.
జనవరి 2020 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో పెద్ద వయస్సు వారికి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్స. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ధనాదాయం పర్వాలేదు. అనవసర ధనవ్యయం ఏర్పడు సూచన. స్పెక్యులేషన్ లాభించదు. జీవిత భాగస్వామితో తగాదాలు తొలగును. వారి అభిమానం, ప్రేమ పొందుదురు. పరదేశి విశ్వవిద్యాలయములందు అభ్యాసం కొరకు ప్రయత్నించు విద్యార్ధులకు ఉత్తమ ఫలితాలు. వ్యాపారాదులు సామాన్య ఫలములనిచ్చును. పనిచేయు కార్యాలయమునందు మాట గౌరవం పెరుగును. సంతాన ప్రయత్నాలకు ఈ మాసం అంత అనువైనది కాదు.
ఫిబ్రవరి 2020 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో చేపట్టిన పనులలో అభివృద్ధి ఏర్పడుట వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభించును. ఉద్యోగ జీవనంలో దీర్ఘకాళిక నూతన ఒప్పందాలు లభించును. నూతన వ్యవహరాదులు ప్రారంభంలో సమస్యలను ఎదుర్కొన్నా మాసాంతానికి విజయవంతమగును. మాస మధ్యమంలో గృహంలో శుభకార్యములు ఏర్పడుటకు అవకాశం కలదు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులకు కోరుకున్న గుర్తింపు, పదవులు. మాసమంతా ధనాదాయం సామాన్యం.
మార్చి 2020 మీనరాశి రాశీ ఫలితాలు:
ఈ మాసంలో తలపెట్టిన ప్రతీ కార్యం, ఆలోచన లాభించును. గతకాలపు సమస్యలు తొలగును. కార్య సిద్ధి, ఆర్ధిక అభివృద్ధి ఏర్పడును. వృధా ధనవ్యయం తగ్గును. చేతిపై ధనం నిలుచును. శారీరక స్వస్థత ఏర్పడును. గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్థి లాభం ఏర్పడును. వివాదాలు తొలగిపోవును. అరుదైన అవకాశములు లభించును. శుభవార్తలు వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరచును. 24 వ తేదీ నుండి 29 వ తేదీ మధ్య కాలంలో మీనరాశి కి చెందిన స్త్రీలకు గర్భ లేదా ఉదర సంబంధ సమస్యలున్నాయి.