సూర్యుడు మకరరాశి ప్రవేశం మనకు మకరసంక్రాంతి ఇది "మార్పుకు సంకేతం"
తెలుగువారి పండుగ, ముఖ్యంగా ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. మగువలు ముచ్చటగా ఇంటి ముందు రంగవల్లులు లేదా ముగ్గులు పోటీలు పడివేస్తారు, రధం ముగ్గు ప్రత్యేకం, గొబ్బెమ్మలు, భోగిమంట, భోగిపళ్ళు, సంక్రాంతి పురుషుడు, గంగిరెద్దు, హరిదాసు, తిల తర్పణం, గాలిపటాలు, కోళ్ళ పందాలు సంక్రాంతి ప్రతేకతలు.
హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో సినీనిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయటం శుభ ప్రదంగా భావిస్తారు. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం.
ఆయన తలమీద మంచి గుమ్మడి కాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పే సంకేతం. నిజానికి ధనుర్మాసారంభంతో నెలరోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభ మవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి.
సంక్రాంతి పండుగను భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్న రీతులలో జరుపు కొంటారు. ప్రత్యేకించి, ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో ఈ సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగాను, కోలాహలం గాను కుటుంబ సభ్యులందరూ ఒక్క చోట చేరి జరుపుకొని ఆనందిస్తారు. సంక్రాంతి పండుగ నాలుగు రోజుల పండుగగా చాలామంది చేస్తారు. మహారాణిలా ముందు "భోగిని" (భోగి పండుగ), వెనుక "కనుమ" (కనుమపండుగ)ను వెంటేసుకుని, చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుంది. ఇదేరోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి పండుగ అంటే ప్రధాన పండుగ గాను, మూడవ రోజున కనుమ పండుగ, నాలుగవ రోజు ముక్కనుమ పండుగ అంటారు.
మొదటి రోజు భోగి పండుగ. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయమే లేచి ఇంటిలోని పనికి రానికొయ్య మొదలగు పాత వస్తువులను తగుల బెట్టి, భోగి మంటలుగా వేస్తారు. నూతన వస్తువుల కు స్వాగతం పలుకుతారు. పాత చెడు అలవాట్లను వదలి, మంచి అలవాట్లకు మారాలని కూడా ఇది సూచిస్తుందని నమ్ముతారు. గ్రామీణ ప్రాంతాలలో మూడు సంవత్సరాల వయసు లోపలి పిల్లలకు 'రేగి పండ్లు' పూవులతో, ఇతర చిల్లర నాణేములతో కలిపి తలపై పోస్తారు. ఈ చర్య తమ పిల్లలను చెడు దృష్టి నుండి కాపాడుతుందని నమ్ముతారు. స్వీట్లు పంచి పెడతారు. ఈ సమయంలో చుట్టుపక్కల కల అన్ని కుటుంబాల వారూ కలుస్తారు. ఈ పండుగ సమయంలో సోదరులు తమ వివాహిత సోదరీ మణులకు ప్రేమకు చిహ్నంగా బహుమతుల నిస్తారు. యజమానులు తమ పనివారికి తగినంత ధాన్యం, దుస్తులు, సొమ్ము వంటి వాటిని కూడా పంపిణీ చేస్తారు.
రెండవ రోజును మకర సంక్రాంతి లేదా పెద్ద పండుగ అని అంటారు. ఇది ప్రధాన పండుగ. ఈరోజున గృహ ప్రాంగణం లో వివిధ రంగులతో ముగ్గులు వేసి (రంగోలి), ఆవుపేడ గొబ్బెమ్మలు, వాటికి పూవులు పెట్టి పాటలు పాడుతూ ఆనందిస్తారు. ఈ రోజున కుటుంబంలోని వ్యక్తులు నూతన దుస్తులు ధరించి, ఇష్ట దైవాలకు పూజలు చేసి, కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యంతో తయారు చేసిన పొంగలి వంటి సాంప్రదాయ ఆహారాలు నైవేద్యం పెట్టి, తాము తింటారు. మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు.
సంక్రాంతి రోజున
సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ,
గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారు
జామున నే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లుల తీర్చిదిద్దుకోవాలి.
తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపు దేవరలు, బుడబుక్కల దొరలు, పంబల వాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగు తుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ఆ రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని (శ్రీహరిని), పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్ష మార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి బంధు మిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బి గౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెల పెట్టింది.. మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది. ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది, గొబ్బి పాటలు పాడుతూ.. కేరింతలు కొడుతుంటారు.
మూడవ రోజున కనుమ రోజున తమ పొలాలలో నిరంతరం శ్రమించే పశువులను కూడా అలంకరించి పూజలు చేస్తారు. ఈ రోజున ప్రయాణాలను మొదలు పెట్టటం ఆశుభంగా భావిస్తారు. మరణించిన తమ బంధు వర్గానికి మత పర క్రియలు ఆచరిస్తారు.
పండుగ నాల్గవ రోజైన ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహారులు ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలు తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి మూడు రోజులూ కోస్తా జిల్లాల ప్రజలు మాంసాహారం తినరు. మొదటి మూడు రోజుల్లోనూ పొంగలితో పాటు, అరిసెలు, అప్పాలు, దప్పళం వంటి పిండి వంటలు చేసి తిని ఆనందిస్తారు. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు 'సావిత్రి గౌరివత్రం' అంటే 'బొమ్మల నోము' పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండి వంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థ మందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటి ఆటలతో పూర్తిగా కోలాహలంగా వుంటాయి. ఈ పందేలలో చట్ట వ్యతిరేక పందేలు భారీగా కాస్తారు. కోట్లాది రూపాయలు గడిస్తారు. ఈ పండుగ రోజులలో ప్రతి రొజూ వేకువ ఝామునే హరిదాస సంకీర్తనం చేస్తూ ప్రతి ఇంటికీ తిరిగి దానములు స్వీకరించే హరిదాసులు ఒక ప్రత్యేక ఆకర్షణ. గంగిరెద్దుల యజమానులు ఎద్దులకు ఆకర్షణీయ దుస్తులు, రంగులు వేసి వాటిని ఇంటి ముందుకు తెచ్చి పాటలు పాడి దానం స్వీకరిస్తారు. దీనిని గంగిరెద్దు మేళం అంటారు.