విదేశాల్లో విఘ్నేశ్వ‌రుడు.. ఎయే దేశాల్లో ఎలా పిలుస్తారో తెలుసా..?

Paloji Vinay
విఘ్నాలు తొల‌గించే దేవుడు విఘ్నేశ్వ‌రుడు. ఇంట్లో చేసుకునే సాధార‌ణ నోములు, పూజ‌లు, ఇత‌ర కార్య‌క్ర‌మాల నుంచి వైదిక యాగాల వ‌ర‌కు అన్నింటిలో గ‌ణ‌ప‌తికి ఆది పూజ చేస్తారు. ఆ ఏక‌దంతుడిని భార‌త దేశంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోనూ పూజిస్తారు. దీంతో విశ్వ‌వ్యాప్తంగా హిందూ సంస్కృతి వ్యాపితం అయిఉంది. వినాయ‌క న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా విదేశాల్లో ఉన్న మ‌న వినాయ‌కుడి గురించి తెలుసుకుందాం.

అమెరికా..
 
    అమెరికాలో నిర్మించిన మొట్ట‌మొద‌టి హిందూ ఆల‌యం వినాయ‌కుడిదే కావ‌డం విశేషం. న్యూయార్క్‌లో ‘శ్రీ మహావల్లభ గణపతి ఆలయం’ గా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయాన్ని స్థానికులు ‘ఫ్లషింగ్‌ టెంపుల్‌’అని అంటారు. ఈ ఒక్క‌టే కాకుండా అమెరికాలోని చాలాచోట్ల ఏక‌దంతుని ఆలయాలున్నాయి.

ఐర్లాండ్..
     
    ఐర్లాండ్‌కు చెందిన విక్ట‌ర్ లాంగ్‌హెల్డ్ద్‌ ఆసియాలో పర్యటించినపుడు విఘ్నేశ్వ‌రుడికి భక్తుడిగా మారాడు. దీంతో గ‌ణ‌ప‌తి మీద ఉన్న భక్తితో ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లోకు సమీపంలోని ‘విక్టోరియా వే’ పార్కు చెక్కిన విగ్ర‌హాల‌ను ప్రతిష్ఠించాడు. తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పకారులు ఈ విగ్రహాలను త‌యారు చేశారు.

జ‌పాన్‌లో..
   జపాన్‌లో వినాయ‌కుడిని కాంగిటెన్‌ అని పిలుస్తారు. గ‌ణ‌ప‌తిని షాటెన్‌, గణాబాచి, బినాయకటెన్‌ ఇలా పలు పేర్లతో పిలుస్తారు అక్క‌డి వాళ్లు. టోక్యోలో అతి పురాతన బౌద్ధ ఆలయాల్లో కాంగిటెన్‌ ఆలయమూ ఒక‌టి.  కొన్ని ఆలయాల్లో ఆడ ఏనుగు (స్త్రీ శక్తి)ను ఆలింగనం చేసుకున్న రూపంలో ఉన్న ప్ర‌తిమలు ఉంటాయి. జ‌పాన్‌లో ఆర్థిక విజయాలు ప్రసాదించే దేవుడిగా లంబోధ‌రుడిని సేవిస్తారు.

సింగపూర్‌
      సింగపూర్‌లోని సిలాన్‌ రోడ్డులో ‘శ్రీ సెంపెగ వినాయగర్‌’ అనే వినాయ‌కుడి ఆల‌యం నిర్మించారు. 162 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ ఆల‌యం  చోళ రాజుల నిర్మాణ శైలిలో ఉంది.

నేపాల్‌లో..
  భార‌త్ త‌రువాత ఏకైక హిందూ దేశం నేపాల్. అక్క‌డి వారు తాంత్రిక ఉపాస‌న‌లో గ‌ణ‌ప‌తిని ఎక్కువ‌గా పూజిస్తారు. నేపాల్ క‌నిపించే వినాయ‌క విగ్ర‌హాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఏట‌వాలు క‌ళ్ల‌తో, చేతుల్లో మొక్క‌లు ధ‌రించి ఉంటాడు. ఇక్క బొజ్జ గ‌ణ‌ప‌య్య‌ను పంట‌ల దేవుడిగా భావిస్తారు.
మయన్మార్‌లో..
      గ‌ణ‌ప‌తి అంటే మనం శివపార్వతుల పుత్రుడిగా ఆరాధిస్తాం. కానీ, మ‌య‌న్మార్‌లో మాత్రం ఆయ‌న‌ను బ్ర‌హ్మ‌గా కొలుస్తారు. నేటికీ ఆ దేశంలో గ‌ణేష్ చ‌తుర్థికి వినాయ‌కుడిని ప‌ర‌బ్ర‌హ్మ‌గా ఆరాధిస్తారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా వారం రోజుల పాటు విశేష పూజ‌లు చేస్తారు.

ఇండోనేషియా..
 
   ఇండోనేషియాలోని బాలిదీవిలో వినాయ‌కుడి ఆలయాలు ఉన్నాయి. పాఠశాలలు, ప్రముఖ నిర్మాణాల్లోనూ ఏక‌దంతుని ప్ర‌తిమ‌లు ప్రతిష్ఠిస్తుంటారు. ఆ దేశ‌ కరెన్సీపై కూడా విఘ్నేశ్వ‌రుడి బొమ్మను మ‌నం చూడొచ్చు. బాలీతో పాటు సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ ఏక‌దంతుని ఆలయాలు క‌నిపిస్తాయి. గ‌ణేష్ చ‌తుర్థితో పాటు ఇతర పర్వదినాల్లో పార్వ‌తి త‌న‌యుడికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు, బాలీలో 30 అడుగుల ఎత్తున్న విఘ్నేశ్వ‌రుడి ప్ర‌తిమ‌ను 2006లో ప్రతిష్ఠించారు. ఈ విగ్ర‌హం చుట్టూ 204 దేశాల జెండాలు ఉంటాయి.
థాయ్‌లాండ్‌..


  థాయ్‌లాండ్‌లో గ‌ణ‌ప‌తిని `ఫ్రా ఫిక‌నెట్‌` అని పిలుస్తారు. బ్యాంకాక్‌కు చెందిన ల్యూంగ్‌ పొర్‌ అనే బౌద్ధ భిక్షువు విఘ్నేశ్వ‌రుడి ఆలయాన్ని నిర్మించమని ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశాడు. అందుకోసం తన భూమిని విరాళంగా ఇవ్వ‌డంతో.. కొంతమంది దాతల సహకారంతో ప్రభుత్వం ఆల‌యాన్ని నిర్మించింది. ఇందులో థాయ్‌లాండ్‌లోనే అతి పెద్ద గ‌ణ‌ప‌తి విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒక విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: