తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు.. ఎంత వరకూ నిజం..?

Chakravarthi Kalyan
తెలంగాణలో త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయా... కేసీఆర్ ఈసారి కూడా పూర్తి స్థాయిలో పాలన కాలం పూర్తి చేయకుండా మధ్యంతర ఎన్నికలకు వెళ్లబోతున్నారా.. తెలంగాణలో ఉప ఎన్నికలే కాదు..ఏకంగా అసెంబ్లీ ఎన్నికలే రాబోతున్నాయా.. అన్న చర్చ మొదలైంది. ఈ చర్చకు అసలు బీజం కాంగ్రెస్ కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేశారు. పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని.. కాంగ్రెస్ నాయకులంతా అందుకు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.

అయితే ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు ఇప్పుడు తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా.. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలా చేయడం వల్ల కేసీఆర్‌కు కొత్తగా ఒనగూడే రాజకీయ ప్రయోజనాలు కూడా ఏమీ కనిపించడం లేదు.

కేసీఆర్ గతంలో ముందస్తు ఎన్నికలుకు వెళ్లినా అందుకో రాజకీయ వ్యూహం ఉంది. పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే.. అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందన్న అంచనాతోనే కేసీఆర్ 2018లోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఒక విధంగా కేసీఆర్ రాజకీయ అంచనా కూడా నిజమే అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని బీజేపీ.. అదే పార్లమెంట్ ఎన్నికల నాటికి అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 4 పార్లమెంటు సీట్లు సంపాదించింది.

కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల.. ఇకపై తెలంగాణలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేవు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రత్యేకంగా వచ్చే లాభాలేమీ లేవు. మరి ఏమీ లేకుండా ఎందుకు రేవంత్ రెడ్డి అంత పెద్ద విమర్శ చేశాడనే ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. నిత్యం వార్తల్లో ఉండటం ఎలాగో తెలిసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసే క్రమంలో భాగంగానే మధ్యంతర ఎన్నికలన్న అంశాన్ని తెరపైకి తెచ్చి ఉండారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: