ఏపీకి కలకాలం సీఎంగా జగనే ఉండాలట.. కేసీఆర్ కోరిక ఇదేనట..?

Chakravarthi Kalyan
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. నీటి వాటాల విషయంలో.. ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు విమర్శలు చేసుకుంటున్నారు. అవి కాస్తా అంశాలు దాటి మరీ సాగుతున్నాయి. వైఎస్ నరరూప రాక్షసుడు అని తెలంగాణ మంత్రులు తిట్టే వరకూ వెళ్లింది విషయం. అయితే ఇదంతా ఉత్తుత్తి యుద్ధమేనట. ఏపీకి జగన్ వంటి నాయకుడే సీఎంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారట.

ఈ మాటలు అంటున్నది ఓ పత్రికాధిపతి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ అభివృద్ధికి ఢోకా ఉండదని ఎన్నికలకు ముందే కేసీఆర్‌ పార్టీ ముఖ్యుల వద్ద చెప్పారని గుర్తు చేస్తున్నారాయన. అంతా ఆయన అంచనా ప్రకారమే జరుగుతోందని.. అంటే జగన్‌ రెడ్డిని కేసీఆర్‌ బాగానే స్టడీ చేశారన్న మాట అని సెటైర్లు వేస్తున్నారు సదరు పత్రికాధిపతి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి సుదీర్ఘ కాలం ఉండాలని కూడా కేసీఆర్‌ కోరుకుంటున్నారని..  అదే నిజమైతే జగన్‌ పైన, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పైన మంత్రులు చేస్తున్న మాటల దాడి ఉత్తుత్తిదేనని అనుకోవాలని విశ్లేషించారు.

ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ఉత్తుత్తి యుద్దమేనంటున్న సదరు పత్రికాధిపతి.. జగన్‌కు రాజకీయంగా నష్టం జరిగే పని కేసీఆర్‌ అండ్‌ కో చేయబోరని తేల్చి చెప్పారు. అవతల వాడి బలహీనతే అప్పుడప్పుడూ మన బలం అవుతుందని.. తెలంగాణలో పెట్టుబడులు పెరుగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో పలు సంస్థలు తమ ప్రతిపాదనలను విరమించుకుంటున్నాయని రాసుకొచ్చారు. ఏపీ పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదని... పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించకపోవడం వల్లనే రిలయన్స్‌, ట్రైటాన్‌ వంటి సంస్థలు తమ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయని చెబుతున్నారు.

అయితే జగన్ అంటే నిలువెల్లా కోపం ఉన్నా.. సదరు పత్రికాధిపతి విశ్లేషణను కొట్టిపారేయలేం.. ఎందుకంటే గతంలో స్వయంగా ఇంటికి పిలిపించుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే నాయకుడిపై  యుద్ధానికి సిద్దం కావడం అంత నమ్మశక్యంగా లేదు. చూద్దాం.. ఈ జల యుద్ధం ఎక్కడి వరకూ వెళ్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: