అయ్యో జగన్.. అప్పుడు కాస్త ఓపిక పడితే ఇప్పుడెంత బావుండేది..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో సహనం అవసరం.. అన్నిసార్లూ దూకుడు వైఖరి పనికి రాదు. కొన్నిసార్లు ఈ దూకుడు చేటు కూడా చేస్తుంది. అదే సమయంలో కాస్త సంయమనం పాటిస్తే.. కొద్దికాలం వేచి చూస్తే మంచి ఫలితాలే వస్తాయి. అందుకు ఉదాహరణ ఏపీలో శాసన మండలిపై జగన్ సర్కారు వైఖరి. మూడు రాజధానుల బిల్లు అంశంలో తనకు సహకరించలేదని.. ఏకంగా శాసన మండలినే రద్దు చేయాలని జగన్ భావించాడు. చేతిలో అధికారం ఉంది కదా అని ఏకంగా శాసన మండలిని రద్దు చేసేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లో శాసన మండలిలో వైసీపీ బలం చాలా తక్కువగా ఉండేది.. టీడీపీ ఆధిక్యం ఉండేది. అందుకే జగన్ సర్కారు ఏ బిల్లు రూపొందించినా దాన్ని మండలిలో అడ్డుకునేవారు. అందుకే జగన్ సర్కారు మండలినే రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే.. మూడు రాజధానుల నిర్ణయం, అటు శాసన మండలి రద్దు ఈ రెండు కూడా కోర్టుల్లో ఆగిపోయాయి. ఇంతలో కాలం మారిపోయింది. ఏడాది తర్వాత ఇప్పుడు శాసన మండలిలో సీన్ మారిపోయింది.
ఇప్పుడు మండలిలో వైసీపీదే పై చేయి అయ్యింది. ఎందుకంటే.. మండలిలో నేటితో ముగియనున్న 8 మంది సభ్యుల పదవీకాలం పూర్తి అవుతోంది. పదవీకాలం ముగిసిన సభ్యుల్లో ఏడుగురు తెదేపా సభ్యులు ఉండగా.. ఇంకొకరు వైసీపీ సభ్యులు. తెదేపా నుంచి రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, జగదీశ్వరరావు పదవీ విరమణ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేస్తున్నారు.
ఈ కొత్త సమీకరణాలతో శాసన మండలిలో వైసీపీ బలం 21కి పెరగబోతోంది. మండలిలో టీడీపీ బలం 15కు తగ్గిపోతోంది. కొత్తగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా వైసీపీకే పుష్కలంగా ఉన్నాయి. దీంతో వైసీపీ బలం ఇంకాస్త పెరుగుతుంది. ఇక ఇప్పుడు జగన్ ఎలాంటి బిల్లులైనా చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఓ ఏడాది ఓపిక పడితే పోయేదానికి జగన్.. మూడురాజధానుల విషయంలో రచ్చ రచ్చ చేసి ఎటూ కాకుండా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: