హెరాల్డ్ సెటైర్ : పీవీ, ఎన్టీయార్ పై బీజేపీకి ఎందుకింత ప్రేమ పెరిగిపోయిందబ్బా ?

Vijaya


 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలని  కాదు కానీ బేజేపీకి ఒక్కసారిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ అంటే ప్రేమ ఒక్కసారిగా పెరిగిపోయినట్లే అనిపిస్తోంది. నిజానికి పీవీ మీద ప్రేమ ఉండాల్సిందే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఎన్టీయార్ పై అభిమానం ఉండాల్సింది ముందుగా తెలుగుదేశంపార్టీకి అని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. అలాంటిది కాంగ్రెస్, టీడీపీని వెనక్కుతోసేసి బీజేపీనే వాళ్ళిద్దరినీ భుజానికెత్తుకోవటం, వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకోవటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైతే పీవీ, ఎన్టీయార్ సమాదులను కూల్చేయాలని ప్రభుత్వానికి ఎంఐఎం అగ్రనేత, ఎంఎల్ఏ అక్బరుద్దీన్ చాలెంజ్ చేశారో అప్పటి నుండి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరుగుతున్నారు.  అక్బరుద్దీన్ కు వ్యతిరేకంగా తోకతొక్కిన తాచుపాము లెక్కన రెచ్చిపోతున్నారు.  సవాళ్ళతో, ప్రతిసవాళ్ళతో ఎంఐఎంపై రెచ్చిపోయి నానా గోల చేసేశారు బుధవారమంతా. గ్రేటర్ పరిధిలో ఎక్కడ ప్రచారం చేసినా పీవీ, ఎన్టీయార్ గురించే బండి మాట్లాడటం విచిత్రంగా అనిపించింది చూసిన వాళ్ళకు.


నిజానికి పీవీ నరసింహారావు సమాధిని కూల్చేయాలని అక్బరుద్దీన్ అన్నందుకు రెచ్చిపోవాల్సింది కాంగ్రెస్ నేతలు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయినా కనీసం ఒక్కసారిగా అక్బరుద్దీన్ కు కౌంటర్ గా మాట్లాడలేదు. వీళ్ళు కాదుకదా కనీసం సీనియర్ నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.  పీవీ అంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకు కొరగానే నేత అయిపోయినట్లు అర్ధమైపోతోంది. దాదాపు 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధం, ప్రధానమంత్రిగా పనిచేసిన పీవీ తెలుగు నేత అవ్వటం కూడా కాంగ్రెస్ నేతలు గుర్తించినట్లు లేదు. ఇక ఎన్టీయార్ విషయానికి వస్తే  ఎన్టీయార్ సమాధిని కూల్చేయాలని అక్బరుద్దీన్ అన్నందుకు టీడీపీ నేతలు కూడా ఏదో మొక్కుబడిగా ఖండనలిస్తు ప్రకటనలిచ్చారంతే. ఒక్కరంటే ఒక్క నేత కూడా అక్బరుద్దీన్ పై ఘాటుగా స్పందించలేదు.  చివరకు చంద్రబాబునాయుడు కానీ లేకపోతే ఎన్టీయార్ కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరు స్పందించలేదు.



నిజానికి పీవీ, ఎన్టీయార్ సమాధులపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించకపోయినా అడిగే వాళ్ళు లేరనే చెప్పాలి. అయినా ఎందుకంత తీవ్రంగా స్పందించారు ? ఎందుకంటే పార్టీ వర్గాల ప్రకారం గ్రేటర్ పరిధిలోని సీమాంధ్రుల ఓట్ల కోసమే. అలాగే పీవీ సమాధిపైనా స్పందించారంటే  కాంగ్రెస్ అసంతృప్త ఓటర్లు+బ్రాహ్మణ ఓటర్లకు బీజేపీ గాలం వేసినట్లే అనుమానిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బాగా చిక్కి  శల్యమైపోయింది. దాని నాయకత్వం మీద కార్యకర్తలకు కానీ లేదా మామూలు జనాలకు కానీ ఏమాత్రం నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకనే రోజు రోజుకు పార్టీ పరిస్ధితి దిగజారిపోతోంది. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. సో వీళ్ళంతా తాజా పరిణామాలతో కాంగ్రెస్ కు కాకుండా తమకు ఓట్లేస్తారని బీజేపీ నేతల ఆలోచన. అలాగే గ్రేటర్ పరిధిలోని కొన్ని డివిజన్లలో సీమాంధ్రుల ప్రభావం తక్కువేమీ కాదు. వారందరికీ ఇప్పటికీ ఎన్టీయార్ అంటే మంచి అభిమానమే ఉంది. కమ్మ సామాజికవర్గానికి అయితే ఎన్టీయార్ ఆరాధ్య దైవమనే చెప్పాలి. అలాంటి వారిని ఆకర్షించేందుకే బండి ఎన్టీయార్ సమాధి కూల్చివేతపై అంతగా స్పందించింది. మరి బండి స్పందనకు ఎన్ని ఓట్లు పడతాయో చూద్దాం.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: