హెరాల్డ్ సెటైర్ : ఒకే విషయంపై తెలంగాణా హైకోర్టు ఒకలా..ఏపి హైకోర్టు ఇంకోలా

Vijaya
ప్రైవేటు స్కూళ్ళ నియంత్రణ విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని రెండు హైకోర్టుల చెరో విధంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఏపిలోని హైకోర్టు వైఖరి వల్లే తెలంగాణా హైకోర్టు వైఖరి పైన కూడా చర్చ మొదలైంది.  ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రలోని ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులపై తల్లి, దండ్రుల్లో ఎప్పటి నుండో ఆందోళన పెరిగిపోతోంది. స్కూళ్ళ యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజులు చాలా ఎక్కువగా ఉంటున్నాయని తల్లి, దండ్రులు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.  ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తల్లి, దండ్రుల సంఘం ముఖ్యులు కలిసి తమ బాధ చెప్పుకున్నాయ. ఈ విషయమై పాదయాత్రలో కూడా తనకు అందిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఓ కమిటిని జగన్ ప్రభుత్వం నియమించింది.





కమిటి నియామకం అయిన కొంత కాలానికే కరోనా వైరస్ సమస్య మొదలైంది. దాంతో కమిటి పని ముందుకు సాగలేదు. వైరస్ సమస్య తగ్గుతున్న నేపధ్యంలో కమిటి పని ప్రారంభించింది. ఫీజుల నియంత్రణ, సిలబస్ , స్కూళ్ళల్లో సౌకర్యాల కల్పన తదితరాలపై మార్గదర్శకాలు రూపొందించింది. మార్గదర్శకాలను అన్నీ స్కూళ్ళకు పంపించిన కమిటి కచ్చితంగా పాటించాల్సిందే అంటూ ఆదేశిచింది. ఫీజులను తరగతుల వారీగా నిర్ణయించింది. సిలబస్ కూడా ఏ స్కూలుకు ఆ స్కూలు కాకుండా అన్నీ స్కూళ్ళకు ఒకటేలా ఉండాలని చెప్పింది. ప్రతి స్కూల్లోను టాయిలెట్లు, బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు తదితర కనీస సౌకర్యాలు ఉండి తీరాల్సిందే అని స్పష్టం చేసింది. కమిటి పంపించిన మార్గదర్శకాలతో సహజంగానే ప్రైవేటు  యాజమాన్యాలు విభేదించాయి. నిజంగానే చాలా ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందనంత ఎక్కువుంటున్న విషయం ప్రపంచానికంతా తెలిసిందే.





ఇక స్కూళ్ళల్లో దేనికదే సిలబస్ ప్రత్యేకమని చెప్పుకుని విద్యార్ధుల నుండి విపరతమైన ఫీజులను వసూలు చేస్తున్నాయి. చాలా స్కూళ్ళల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదన్నది వాస్తవం. ఇటువంటి వ్యవహారాలకు చెక్  చెప్పాలని ప్రభుత్వం అనుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూళ్ళ తనిఖీకి కూడా కమిటి రెడీ అయిపోయింది. కమిటి తనిఖీలో తమ బండారం బయటపడుతుందన్న ఆందోళన ప్రైవేటు యాజమాన్యాల్లో పెరిగిపోయింది. ఇందుకని  కమిటి మార్గదర్శకాలపై ప్రైవేటు యాజమాన్యాలు కోర్టులో కేసు వేశాయి. కేసును విచారించిన హైకోర్టు స్కూళ్ళ తనిఖీ చేయటానికి వీల్లేదంటూ స్టే ఇచ్చేసింది. స్కూళ్ళు వసూలు చేస్తున్న ఫీజుల విషయంలో కూడా కమిటి జోక్యం చేసుకోవటం కుదరదని చెబుతుందో ఏమో చూడాల్సిందే. కమిటి రూపొందించిన మార్గదర్శకాల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని స్కూళ్ళ యాజమాన్యాలు వాదించటమే విచిత్రంగా ఉంది.





మొత్తానికి ప్రభుత్వం చేయాలని అనుకున్న మరో కార్యక్రమాన్ని హైకోర్టు అడ్డుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్గదర్శకాలను అమలు చేయించటం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ లేదు. కానీ విద్యార్ధుల తల్లి, దండ్రులపై ఆర్ధికభారం తగ్గుతుంది. స్కూళ్ళల్లో వసతి, సౌకర్యాలు పెరిగితే విద్యార్ధులకే మంచిది. ఇంతచిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా కోర్టు ఎలా స్టే ఇచ్చిందో. ఇదే సమయంలో తెలంగాణా హైకోర్టు ఏపి హైకోర్టు వైఖరికి భిన్నమైన తీర్పిచ్చింది. ప్రైవేటు స్కూళ్ళు వసూళ్ళు చేస్తున్న ఫీజులపై ప్రభుత్వానికి ఎందుకు నియంత్రణ లేదంటూ సూటిగా నిలదీసింది. వెంటనే తనిఖీలు చేసి ఫీజులను నియంత్రించాలని, వసతి, సౌకర్యాలను కల్పించేట్లుగా చూడాలంటూ ప్రభుత్వాన్ని  ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే సమస్య ఒకటే. రెండూ తెలుగు రాష్ట్రాలే. స్కూళ్ళ యాజమాన్యాలూ దాదాపు ఒకటే,  హైకోర్టులు వేరు, తీర్పులు వేరంతే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: