సెటైర్ : 'మా లోకం' లోకి రా చినబాబు..!

యువ నాయకుడు, కాబోయే టిడిపి అధినేత గా, అవకాశం దొరికితే సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉన్నా, టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇప్పటికీ పసివాడి గానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అనే విమర్శలు మూట కట్టుకుంటున్నారు. తండ్రి చాటు బిడ్డగా, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం గడించినా, ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డగానే వ్యవహరిస్తూ, కార్పొరేట్ కంపెనీల తరహాలో రాజకీయాలను ముందుకు నడిపించాలనే అభిప్రాయంతో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్ధులకు ఎప్పుడూ, లోకేష్ ఆట వస్తువుగానే కనిపిస్తూ వస్తున్నారు. టిడిపిపై విమర్శలు చేయాలన్నా, దానిని చంద్రబాబుకు లింకు పెట్టి మరీ విమర్శలు చేస్తూ, లోకేష్ ను రాజకీయ కమెడియన్ గా చిత్రీకరించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా, ఆ నిందలా నుంచి బయటపడి, సమర్థుడైన రాజకీయ నాయకుడిగా నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నించకపోవడంతో ఆయన నాయకత్వంపై ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతల్లో అనుమానాలు, భయాలు పోవడం లేదు.

 ఇప్పుడు కరోనా భయంతో చంద్రబాబు ఇంటి కే పరిమితం అయిపోయారు. ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు కరోనా, ఇప్పుడు వరదలతో జనాలు సతమతం అవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా రాజకీయ విమర్శలు చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, హడావుడి చేసే అవకాశం ఉన్నా, ఆ అవకాశాన్ని చంద్రబాబు చేజేతులా, వదులుకుంటూనే వస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయంలోనూ హడావుడి చేస్తూ, ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు లోకేష్ ప్రయత్నించకపోవడం, కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చే విధంగా చేస్తూ, ఆ సమస్యల పైన ఎక్కువగా స్పందిస్తూ,  నాయకత్వ లక్షణాలు తనకు లేవనే విధంగానే ఆయన వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు కు సైతం మింగుడు పడడం లేదట.

 ఏపీలో బీజేపీ ఇప్పుడు పరుగులు పెడుతోంది. కొత్త గా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు బీజేపీని జనాల్లోకి తీసుకువెళ్లే విషయంలో సక్సెస్ అవుతున్నారు. టిడిపి స్థానాన్నిఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో చంద్రబాబు ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశమే లేదు. వయసు రీత్యా ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మేలు. ఈ సమయంలో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని, చంద్రబాబు లోటుని కనిపించకుండా, జనాల్లో తిరగాల్సిన లోకేష్ కరోనా భయం తో ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు సాహసించకపోవడంతో టిడిపి నాయకుల్లో నిరుత్సాహం, లోకేష్ తీరుపైన అసహనం వ్యక్తం అవుతున్నాయి.

వయసు రీత్యా చూసుకున్నా, సోము వీర్రాజు వంటివారు జనాల్లో తిరిగేందుకు ఎటువంటి సంకోచం పడడం లేదు. కానీ యువకుడైన లోకేష్ మాత్రం ఇంటి నుంచి అడుగు పెట్టేందుకు సాహసించకపోవడం, ఆయన రాజకీయ ఎదుగుదలను ఆయనే చేజేతులా నాశనం చేసుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నారు. చినబాబు మా లోకంలోకి రా... ఈ ఆంధ్రా జనాల్లోకి రా !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: