ఇలా అప్పు.. అలా జమ: జగన్‌ సర్కారుకు ఆర్బీఐ షాక్..?

Chakravarthi Kalyan
కరోనా కారణంగా తగ్గిన ఆదాయాలు.. పెరిగిన సంక్షేమం ఖర్చులు.. మొత్తం మీద ఏపీ సర్కారుకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఎంత వీలుంటే అంత అప్పులు చేసేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. అయితే.. తాజాగా అలా ఓ 2 వేల కోట్ల రూపాయల అప్పు వచ్చేసింది.. కాస్త వెసులు బాటు దొరుకుతుంది అని ఆలోచించే లోపే.. ఆ వచ్చిన రుణం సొమ్ము కాస్త పాత బాకీ కింద ఆర్బీఐ లాగేసుకుందన్న వార్తలు ఏపీ సర్కారు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు తీసుకునేందుకు సెక్యూరిటీల వేలం ఓ మార్గం.. అయితే అందుకు కేంద్రం అనుమతి కావాలి.. గతంలో తీసుకున్న అప్పులు అన్నీ లెక్కలు వేసి.. ఎంత రుణం తీసుకునే అవకాశం ఉందో పరిశీలించి అంత మేరకే అప్పు తీసుకునేలా కేంద్రం అనుమతులు ఇస్తుంది. అయితే.. విద్యుత్తు రంగ సంస్కరణలతో అదనంగా 2వేల కోట్లు రుణం పొందేందుకు ఏపీకి అనుమతి వచ్చింది. దీంతో ఏపీ సర్కారు నిన్న సెక్యూరిటీల వేలంలో పాల్గొంది. 2 వేల కోట్ల రూపాయల వరకూ సెక్యూరిటీల వేలంలో సంపాదించింది. ఇందులో వెయ్యి కోట్ల సొమ్ముకు 16 ఏళ్ల కాలపరిమితితో 7.37 శాతం వడ్డీ చెల్లించనుంది.  మరో వెయ్యి కోట్లకు 20 ఏళ్ల కాలపరిమితికి అదే వడ్డీ రేటు చెల్లించనుంది.

అయితే.. జగన్ సర్కారు ఇప్పటికే వసూళ్లకు మించి రిజర్వ్‌ బ్యాంక్ వద్ద నిధులు వాడేసుకుంది. ఇప్పటికే ఓవర్‌ డ్రాఫ్టు సొమ్ము కూడా వాడుకుంది. అందుకే నిన్న తీసుకున్న 2 వేల కోట్ల రూపాయల అప్పు మొత్తం ఓవర్‌ డ్రాఫ్టు- ఓడీకే సర్దుబాటు చేయాల్సి వచ్చిందట. అంటే ఇలా 2 వేల కోట్ల రూపాయల సొమ్ము ఇలా వచ్చినట్టే వచ్చి.. అలా మాయం అయ్యిందన్నమాట.. 2 వేల కోట్లు వస్తే.. ఏదో ఒక పథకానికి సర్దుబాటు చేయవచ్చని భావిస్తే.. ఆర్బీఐ ఇలా షాక్‌ ఇవ్వడం ఏపీ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.

ఏపీ సర్కారు ఇప్పటికే జనవరి తర్వాత రెండు విడతలుగా 4 వేల 500 కోట్లు అప్పు తీసుకుంది. జనవరి 4న 2 వేల 500 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత అప్పు కోసం ఇప్పటి వరకూ ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక 2 వేల కోట్లు వచ్చిందని భావిస్తే.. అది కాస్తా ఇలా షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: