అంతా ఫేక్‌.. నేనలా అనలేదు బాబోయ్‌..?

Chakravarthi Kalyan
కరోనా ఓవైపు విజృంభిస్తుంటే.. దీనికంటే జోరుగా కరోనాకు సంబంధించిన ఫేక్ వార్తలు విజృంభిస్తున్నాయి. అదేం అత్యుత్సాహమో కానీ.. కొందరు ఇలా పుకార్లు వ్యాపింపచేసి శునకానందం పొందుతుంటారు. ఇప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో రెండు, మూడు ఎడిటింగ్‌ యాప్‌లు ఉంటే చాలు.. ఇక ప్రపంచంలో ఎవరి మీదైనా సరే.. నిరాటంకంగా బురద చల్లేయొచ్చు.. ఏదో ఒక తప్పుడు వార్త జనం నమ్మేలా పుట్టించవచ్చు. ఆ తప్పుడు వార్తను జనం నిజమేనని భ్రమపడి షేర్ చేస్తూ ఉంటే... వీళ్లు ఆనందం పొందుతుంటారు. ఇది ఒక విధంగా శాడిజమే.

ఓ వ్యక్తి శాడిజంతో ఒకరిని కొడితే అది పెద్ద నష్టం కాదు.. కానీ.. అదే శాడిస్టు.. ఓ తప్పు వార్తను సృష్టించి ప్రచారం చేస్తే.. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కారణంగా తప్పుడు వార్తలు మరింత జోరుగా వ్యాపిస్తుంటాయి. ఇప్పుడు అదే జరిగింది. తెలంగాణ వైద్యశాఖ ఉన్నతాధికారి.. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇదే మొత్తుకుంటున్నారు. ఆయన తరచూ మీడియాతో మాట్లాడుతుంటారు. కరోనా సమయంలో ప్రజలను ఎప్పటికప్పుడు ఆయన అప్రమత్తం చేస్తూ వచ్చారు.  

ఆయన చెబితే ఎవరైనా నమ్మేస్తారు. అందుకే ఇప్పుడు ఫేక్‌న్యూస్ క్రియేటర్లు ఈయన్ను కూడా వాడేసుకుంటున్నారు. ఇంకేముంది.. తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టేస్తున్నామని ఆయన అన్నట్టుగా కొన్ని తప్పుడు వార్తలు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో వదలారు కొందరు శాడిస్టులు.. ఇది చూసి నిజమేననుకుని చాలామంది వాటిని షేర్‌ చేస్తున్నారు. ఈ ప్రచారం విషయం చివరకు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు వరకూ చేరింది.

దీంతో ఆయన స్వయంగా స్పందించారు. ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉందన్న డీహెచ్‌.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో  నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండబోవని ఇదివరకే చెప్పామని గుర్తుచేశారు. జనవరి చివరలో లాక్‌డౌన్ ఉండొచ్చునని తాను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని..  ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదన్నమాట అసలు విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: