మంచిమాట: నలుగురికీ మేలు చేసినప్పుడే అసలైన ఆనందం..!!

Divya
ముసికన్ను అనే అడవిలో ఒక కోతి ఉండేది. అల్లరి చేష్టలతో తిక్క పనులతో సరదాగా గడిపేది.అలాంటి కోతి ఒక రోజు దిగులుగా ఉండటం ఉడుత గమనించి కారణం అడిగింది. కోయిల పాటను, నెమలి నాట్యాన్ని, లేడి పరుగును, సింహం రాజసాన్ని, పులి రివిని అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ నన్ను ఎవ్వరూ పొగడటం లేదు. అని బాధపడింది. నీ చేష్టలను తుంటరిపనులను ఎవరు ఇష్టపడరు. ఏదో ఒక ఉపయోగపడే ప్రతిభ ఉంటేనే ఘనత లభిస్తుంది. అని చెప్పింది ఉడత..
ఆ రోజు నుంచి ఏదో ఒక విద్య బాగా నేర్చుకుని అందరి మెప్పు పొందాలని అనుకుంది. కోతి వెంటనే అడవి నుంచి దగ్గర్లో ఉన్న పల్లెటూరుకి వెళ్ళింది. అక్కడ ఒక వైద్యుడు ప్రజలకు సేవ చేయటం కనిపించింది. కోతి ఆయన దగ్గరకు వెళ్లి అడవిలో జంతువులు జబ్బులతో, గాయాలతో, బాధ పడుతున్నాయి.. నాకు వైద్యం నేర్పితే వాటికి సేవలందిస్తాను అంది కోతి .
కోతి కోరిక విన్న వైద్యుడికి ముచ్చటేసి సరేనన్నాడు.. అప్పటి నుంచి కోతి ఆయనకు సహాయపడుతూ వైద్యం నేర్చుకుంది.కొన్ని రోజుల తర్వాత వైద్యుడి అనుమతి తీసుకొని అది అడవి కి వెళ్ళింది. కనిపించకుండా పోయిన కోతి తిరిగి రావడంతో జంతువులన్నీ చుట్టూ చేరి ఎక్కడికి వెళ్లావు..?  ఎలాగున్నావు? కుశల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. తాను వైద్యం నేర్చుకున్న విషయం చెప్పడంతో జంతువులు సంతోషించాయి. తర్వాత కోతి అడవిలో తిరిగి వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించుకుంది.
ఆహారం జీర్ణం కావడం లేదని గుర్రం, దంతం నొప్పిగా ఉందని ఏనుగు, కాలికి గాయం అయిందని జింక.. కుందేలు ఇలా ఒక్కొక్కటిగా రకరకాల జంతువులు కోతి దగ్గరకు వరుస కట్టాయి.
వైద్యం పొందిన తర్వాత నమస్కరిస్తూ దాని సేవలను పొగుడుతూ కృతజ్ఞతలు చెబుతున్నాయి. కోతికి ఇప్పుడు ప్రశంశలకంటే తాను చేస్తున్న సేవే ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఎంతో కష్టపడి పట్టుదలగా కృషిచేసి నేర్చుకున్న ప్రతిభతోనే ఘనత లభిస్తుంది. ఆ విద్య ఇతరులకు ఉపయోగపడితే అంతకుమించిన తృప్తి, ప్రశాంతత ఎక్కడ లభించవు అని మనసులో అనుకుంది. కోతి తనలో ఈ మార్పులకు కారణమైన ఉడుత కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ విషయాన్ని అడవిలోని మిగతా జంతువులకు వివరించింది. కోతి మాటలతో ప్రభావితమైన జీవులు అప్పటినుంచి ఐక్యమత్యంగా ఉంటూ అందరికీ మేలు చేకూర్చే పనులే చేయాలని నిర్ణయించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: