మంచిమాట: విషయం తెలియకుండా ఎవరినీ నిందించరాదు..!!

Divya
ఒక అడవిలో ఒకకోతి ఒక చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకుని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చి.. కోతిని చూసి 'ఇది రాత్రి పగలూ బాగా దొంగతనాలు చేసినట్టుంది కాబట్టే అలసిపోయి నిద్రపోతోంది అని' అనుకుంది.. ఈ విషయాన్ని కనిపించిన ప్రతి జంతువుకూ కూడా చెప్పింది. కాసేపటికి ఎలుగు బంటి కూడా కళ్ళు మూసుకున్న కోతి ని చూసింది. 'ఈ కోతి నాలాగే పీకలదాకా తిన్నట్లుంది'అని దాని మిత్రులకు చెప్పింది. ఇంకా సేపటికి కొంగ కోతిని చూసింది. దీనికి ఏదో రోగ మొచ్చినట్టుంది. అనుకొని స్నేహితులందరికీ చెప్పింది.

మరికాసేపటికి అటుగా వచ్చిన కుందేలు..ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పింది. అనుకొని అన్ని జంతువులకు ఇదే విషయం చెప్పింది. ఈ సంగతి అనుమానపు సింహం చెవిన పడింది. అదేమో తన పదవిని కాజేయాలనే కోతి దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లుంది. అనుకుంది కొంత సమయం తర్వాత కోతిని నిద్రలేపడానికి దొంగ నక్క, ఎలుగు,  కొంగ, కుందేలు సింహం... ఇలా జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి. అప్పుడు ఒక ముసలి గద్ద అక్కడ వాలి ఎందుకు గుంపుగా ఉన్నారని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గద్ద నవ్వింది. ఇప్పుడు మీరందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పారు.
కోతి ఎందుకలా ఉందో దాన్ని అడిగి తెలుసుకుందాం! అంది.. జంతువులన్నీ అరిచేసరికి కోతి కళ్ళు తెరిచి చూసింది. గద్ద విషయమంతా దానికి వివరించింది. కోతి కిచ.. కీచ.. నవ్వి.. కాదు.. కాదు.. నేను పట్నం లో ఒక మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు.. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట అంది.. గద్ద నవ్వి.. చూశారా మిత్రులారా! విషయం తెలుసుకోకుండా.. ఎవరికి తోచినవి వారు కోతికి ఆపాదించారు. అంది..అవి తమ తప్పు తెలుసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాయి. కోతి మళ్లీ తన ధ్యానంలో తాను మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: