అవినాష్‌కు చెక్ పెట్టేలా చంద్ర‌బాబు, లోకేష్ వేసిన స్కెచ్ ఇది..!

RAMAKRISHNA S.S.
- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కడప పార్లమెంటు నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ  ప్రత్యేక దృష్టి సారించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో పాగా వేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కడప పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జిగా యువనేత రెడ్డప్పగారి భూపేష్ రెడ్డిని నియమించేందుకు కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.


అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన భూపేష్ రెడ్డి :
గత పార్లమెంట్ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపేష్ రెడ్డి అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత అవినాష్ రెడ్డికి 3.80 లక్షల పైచిలుకు మెజారిటీ రాగా, గత ఎన్నికల్లో భూపేష్ రెడ్డి ఇచ్చిన గట్టి పోటీ వల్ల ఆ మెజారిటీ కేవలం 62,000 ఓట్లకు పడిపోయింది. వైసీపీ కంచుకోటలో మెజారిటీని భారీగా తగ్గించడం ద్వారా భూపేష్ రెడ్డి తన సత్తా చాటారు. బలమైన గళం, స్థానికంగా ఉన్న మంచి ఇమేజ్ ఆయనకు కలిసొచ్చాయి. యువతను, పార్టీ శ్రేణులను ఏకం చేయడంలో ఆయన విజయవంతమయ్యారు.


ఇన్చార్జి బాధ్యతలు.. వ్యూహాత్మక అడుగు :
భూపేష్ రెడ్డిని పార్లమెంటరీ ఇన్చార్జిగా నియమించడం వెనుక అధిష్టానం ఒక స్పష్టమైన వ్యూహంతో ఉంది. వాస్తవానికి భూపేష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్నారు. అయితే, కడప పార్లమెంట్ పరిధిలో అవినాష్ రెడ్డిని ఢీకొట్టేందుకు ఆయనకంటే సరైన అభ్యర్థి లేరని చంద్రబాబు, లోకేష్ ఇద్ద‌రూ భావిస్తున్నారు. ఇన్చార్జిగా బాధ్యతలు చేపడితే, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసే అవకాశం ఉంటుంది.


అవినాష్ రెడ్డికి చెక్:
ఇప్పటి నుంచే భూపేష్ రెడ్డిని క్షేత్రస్థాయిలోకి పంపడం ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభావానికి గండికొట్టవచ్చని టీడీపీ అంచనా వేస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గ మద్దతు, యువ నాయకత్వం కలగలిసిన భూపేష్ రెడ్డి ద్వారా తటస్థ ఓటర్లను కూడా ఆకర్షించవచ్చని పార్టీ భావిస్తోంది. ఏదేమైనా కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే దూకుడున్న నాయకత్వం అవసరమని భావించిన అధినాయకత్వం, భూపేష్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది. త్వరలోనే వెలువడనున్న అధికారిక జాబితాలో ఆయన పేరు ఖరారు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, వచ్చే ఎన్నికల నాటికి కడపలో వైసీపీ, టీడీపీ మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: