అప్పుడే ఈ సీట్లు జనసేనకు రిజర్వ్ అయ్యాయా.. ?
ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాల్లో జనసేన పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు బలమైన పునాది ఉన్న ప్రాంతం కావడంతో, ఇక్కడ తన పట్టును మరింత సుస్థిరం చేసుకోవాలని అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ బాధ్యతను పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు అప్పగించారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలిచిన 21 అసెంబ్లీ స్థానాల్లో 6 స్థానాలు ఉత్తరాంధ్ర నుంచే రావడం విశేషం. విశాఖలో 4, విజయనగరం, శ్రీకాకుళంలో చెరొకటి చొప్పున గెలిచి తన ఉనికిని చాటుకుంది. నాగబాబు ఇప్పటికే మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, గ్రౌండ్ లెవల్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ 2029 లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్నారు.
శ్రీకాకుళంలో 'ట్రిపుల్' టార్గెట్ :
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పాలకొండ స్థానాన్ని కైవసం చేసుకున్న జనసేన, వచ్చే ఎన్నికల్లో మరో రెండు కీలక స్థానాలపై కన్నేసింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇక్కడ సామాజిక సమీకరణాలు జనసేనకు అనుకూలంగా ఉన్నాయని పార్టీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ సీటు బీజేపీ వద్ద ఉన్నా... భవిష్యత్తులో ఇక్కడ జనసేన జెండా ఎగురవేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, స్థానిక నేతల నేతృత్వంలో ఇక్కడ పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన రాజకీయ సమీకరణం నడుస్తోంది. 2024లో టీడీపీకి చెందిన మామిడి గోవిందరావు గెలవగా, జనసేన ఈ స్థానాన్ని గట్టిగా కోరుకుంటోంది. ఇక్కడ ఒక మహిళా నేత ప్రస్తుతం పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్తకు ఇటీవల నామినేటెడ్ పదవి దక్కడం, అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యం ఆమెకు కలిసొచ్చే అంశాలు. వైసీపీలోని అసంతృప్త నేతలను జనసేనలోకి ఆహ్వానిస్తూ, అక్కడ ఫ్యాన్ బలాన్ని తగ్గించేలా ఆమె దంపతులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో కనీసం 3 స్థానాలను (పాలకొండ, ఎచ్చెర్ల, పాతపట్నం) తన ఖాతాలో వేసుకోవాలని జనసేన పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. నాగబాబు మార్గదర్శకత్వంలో పార్టీ యంత్రాంగం కిందిస్థాయి నుంచి బలోపేతం అవుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, సొంత బలాన్ని పెంచుకునే ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.