మాకు ప్రాధాన్యం లేదా... ఎమ్మెల్యేల బాధ చూశారా..?

RAMAKRISHNA S.S.
- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న పరిస్థితులపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారుల తీరు, ప్రోటోకాల్ విషయంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యంపై అధికార పార్టీ శాసనసభ్యులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి లేఖ - సంచలనం :
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తాజాగా పార్టీ కార్యాలయానికి రాసిన లేఖ ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. తన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ విధులకు సంబంధించి తాను చేసిన సిఫార్సులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు చిన్నపాటి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు చేసినప్పటికీ, సెక్యూరిటీ ఉద్యోగాల భర్తీలో కోడుమూరు వాటా ఇవ్వకపోవడంపై దస్తగిరి మండిపడుతున్నారు. కనీసం ఒక ఎమ్మెల్యేగా తన విన్నపాన్ని బుట్టదాఖలు చేయడం పట్ల ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. ?
ఈ సమస్య కేవలం కోడుమూరుకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇదే తరహా గొడవలు జరుగుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే స్థానికంగా ఉండే చిన్న చిన్న పనుల్లో కార్యకర్తలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు గతంలో సూచించారు. ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఉపాధి చూపించే ప్రయత్నం చేస్తుంటే, దిగువ స్థాయి అధికారులు మాత్రం నిబంధనల పేరుతోనో లేదా పాత అలవాట్లతోనో సహకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.


కలెక్టర్ల సదస్సులో చర్చకు విజ్ఞప్తి :
ప్రస్తుతం అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యేలు తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల తీరు మారాలని, ప్రజాప్రతినిధుల సిఫార్సులకు విలువ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అధికారులపై ఎమ్మెల్యేలకు ఉన్న ఈ అసంతృప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకోవాలని, కలెక్టర్ల సమావేశంలోనే దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: