మంచిమాట: మనిషిని మైమరిపించే దేవుడి తెలివి..

Divya
దేవుడు ఏం చేసిన తెలివిగా చేస్తాడు..దూర దృష్టి కలవాడు..ఆయన ఏమి చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సృష్టిస్తూ వుంటాడు. ఇక దేవుడు తెలివైన వాడు అని చెప్పడానికి ఉదాహరణే ఈ కథ.
ఉదాహరణకు.. అనగనగా ఒక ఊరిలో కాశీనాథుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక రోజు అరణ్య మార్గం గుండా వెళుతున్నాడు. దారి మధ్యలో  నడిచి, నడిచి, అతనికి అలసట  వచ్చింది. ఇక అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడ ఉన్న పెద్ద మర్రిచెట్టు దశదిశలకు వ్యాపించినట్లు ఎంతో పెద్దదిగా ఉంది. చెట్టునీడన చల్లగా ఉండడంతో, అలసిపోయిన కాశీనాథుడు హాయిగా ఆ చెట్టుకింద విశ్రమించాడు. అక్కడ చెట్టు కింద అంతా చిన్న చిన్న మర్రి కాయలు ఉన్నాయి.
అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది . దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కాశీనాథుడికి వాటిని చూసి నవ్వు వచ్చింది.. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువ ఉన్నట్టుంది ..ఇంత పెద్ద మర్రిచెట్టుకు ఇంత చిన్న కాయలు..అంత చిన్న తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు.. అనుకుంటూ భగవంతుడి తెలివిని విమర్శిస్తూ నిద్రపోయాడు.
అతను నిద్ర లేచి చూసేటప్పటికి,  తల మీద చిన్న చిన్న మర్రి కాయలు పడి ఉన్నాయి. వీటిని చూసిన కాశీనాధుని వెన్నులో జలదరించింది. ఆ గుమ్మడి కాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాచి ఉంటే, అవి తన మీద పడి ఉంటే, తన తల పగిలి చచ్చే వాడిని.. దేవుడు చాలా తెలివైనవాడు ..ఎంతో దూరదృష్టి కలవారు.. అనుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు కాశీనాథుడు.
కాబట్టి భగవంతుడు ఏం చేసినా.. మన మంచికే అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వాటిని సృష్టించడానికి మనం ప్రయత్నం చేయకపోయినప్పటికీ , ఇతరుల సృష్టించిన దానిని విమర్శనా దృష్టితో చూడకుండా ఉండటం మంచిది.. అప్పుడే ఎదుటి వారి జీవితాలు సుఖంగా ఉంటాయి. మనం కూడా జీవితంలో ఎదుగుతాము..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: