మంచి మాట : ఉచితంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు.. కష్ట పడింది ఏదీ నిన్ను వీడి వెళ్ళదు..
ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో మీలో ఒక మార్పు తీసుకురావాలని, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది ఇండియా హెరాల్డ్. అందులో భాగంగానే మీ కోసం ఒక మంచి మాటను ఇప్పుడు తీసుకువచ్చింది. ఇప్పుడు చెప్పబోయే ఈ మంచి మాట శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పబడిన ఒక సన్నివేశం నుంచి తీసుకోబడింది. అది ఏమిటంటే.. ఉచితంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు.. కష్ట పడింది ఏదీ నిన్ను వీడి వెళ్ళదు..
అయితే ఆ సన్నివేశం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
పంచ పాండవులలో మొదటి వారైనా ధర్మరాజు ధర్మానికి, న్యాయానికి పెట్టింది పేరు. ఎవరు సహాయం అడిగినా సరే లేదనకుండా దానం చేయగల వ్యక్తి ధర్మరాజు. అంతేకాకుండా తన కంటే ఎక్కువ దానం చేసే వాళ్ళు ఇంక ఎవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం కూడా. అయితే ఇది ధర్మరాజుకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది.. ఇక అనిపించినది తడువుగా శ్రీకృష్ణుడు ధర్మరాజు ను వేరే రాజ్యానికి తీసుకెళ్తాడు..
ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది. ఆ రాజ్యంలో అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్ళు ఇచ్చింది. వాళ్లు ఆ నీటిని తాగిన తర్వాత ఆమె ఆ గ్లాస్ ను బయటకు విసిరేసింది.. ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలే తప్పా..ఇలా వీధిలో పడేస్తే ఎలా..? అని అనడంతో ఆమె..మా రాజ్యంలో ఒకరు వాడిన వస్తువును మేము మళ్ళీ వాడమని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.
ఆరాజ్యపు సంపద గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇక రాజును కలవడానికి ఇద్దరూ వెళ్లారు.. కృష్ణుడు మహా బల రాజు తో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేశాడు. రాజా..! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు మొఖం కూడా చూడలేదు..కానీ కృష్ణుడి తో ఇలా అన్నాడు కృష్ణా..మీరు చెప్పిన విషయం సరే కానీ, నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉంది. అందరి దగ్గర డబ్బు ఉంది. నా రాజ్యంలో అందరికీ కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇక్కడ ఉచితంగా తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దానానికి ఇక్కడ తావు లేదు. ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మా రాజ్యంలోని ప్రజలు స్వతహాగా కష్టపడి సంపాదించుకున్న దానితోనే స్వతంత్రంగా బతుకుతున్నారు.
కానీ ఈయన రాజ్యంలో బీద వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు.. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారామో. ఆయన రాజ్యంలో అంత మందిని పేదవారి గా ఉంచినందుకు ఆయన ముఖం చూడాలంటే నాకు సిగ్గుగా ఉంది అని అన్నాడు మహా బల చక్రవర్తి. ఇక ఈ మాట విన్న ధర్మరాజు తన రాజ్య పరిస్థితి ని తలచుకోని సిగ్గుపడి తలదించుకున్నాడు. సహాయం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తలదించుకోవాల్సి వస్తుందని చక్కగా వివరించాడు మహా బలి చక్రవర్తి..
కాబట్టి ఎవరి దగ్గర సహాయం తీసుకోకుండా ఉచితంగా వచ్చేది ఏదైనా దూరం పెడుతూ.. నువ్వు కష్టపడి సంపాదించుకున్న దానికి మాత్రమే నువ్వు యజమాని వి అవుతావు. కాబట్టి కష్టపడి జీవించడానికి అలవాటు చేసుకో.. మిత్రమా..