బాబు ఆ మంత్రిని బలిపశువును చేస్తున్నారా..?

Chakravarthi Kalyan
శనివారం నాటి ఏపీ మంత్రివర్గ సమావేశం హాట్ హాటా గా సాగినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి పుష్కరాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పుష్కరాలు ఇంకా పట్టుమని పదిరోజులు కూడా లేకపోయినా పనుల నిర్వహణ ఇంకా  ఓ కొలిక్కిరాకపోవడంపై ఆయన మండిపడినట్టు సమాచారం. 

పుష్కర ఏర్పాట్ల విషయంలో బీజేపీకి చెందిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తిం చేశారట. పుష్కర ఏర్పాట్లపై మంత్రి చొరవతీసుకోలేదని చంద్రబాబు అన్నారట. ఐతే చంద్రబాబు ఆరోపణలపై సదరు మంత్రి కూడా ఘాటుగానే స్పందించినట్టు కథనాలు వస్తున్నాయి. 

అసమర్థుడిగా ముద్ర వేస్తారా - మాణిక్యాల ఆవేదన


వాస్తవానికి పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు కేవలం దేవాదాయశాఖ మంత్రిపైనే ఆధారపడలేదు. పుష్కర ఏర్పాట్లపై ఓ కమిటీ వేసి దానికి తాను బాగా నమ్మే పరకాల ప్రభాకర్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత తన ముఖ్య సహచరుడు నారాయణకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ చేసి చివరి నిమిషంలో తనను దోషిగా నిలబెడుతున్నారని మంత్రి మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

బీజేపీ ఎమ్మెల్యేకు క్యాబినెట్‌లో చోటు కల్పించినట్లే కల్పించి.. సదరు మంత్రి విఫలమయ్యారని అపవాదు వేస్తున్నారని మాణిక్యాల రావు ఆవేదన వ్యక్తం చేసినట్టు కథనాలు వస్తున్నాయి. మాణిక్యాలరావు ఆవేదనతో కంగుతిన్న ఇతర మంత్రులు ఆయనకు సర్ది చెప్పారని తెలిసింది. కీర్తి వస్తే తన ఖాతాలో.. అపకీర్తి వస్తే అది సదరు మంత్రుల ఖాతాలో అన్నట్టు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారన్న ఆవేదన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: