హిందువులు పదేసి మంది పిల్లలను కనండి

Chowdary Sirisha
మెజారిటీ స్థితిని యథాతథంగా ఉంచడానికి హిందువు కుటుం బాల్లో పదేసి మంది పిల్లలను కనాలని శివసేన పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు వివాదానికి దారి తీసింది. పది మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న హిందువుల కుటుంబాలకు 21 వేల చొప్పున రివార్డులు ఇస్తామని శివసేన ఉత్తరప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు అనిల్‌ సింగ్‌ పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. జాతీయ ప్రయోజనాల కోసం జనాభాను పెంచడానికి దోహదం చేసిన ఆ కుటుంబాలకు సర్టిఫికెట్లు కూడా ఇస్తామని ఆయన చెప్పారు. అనిల్‌ సింగ్‌ ప్రకటనను పార్టీ మరో నాయకుడు సురేంద్ర శర్మ బలపరిచారు. హిందువుల జనాభా తగ్గుతూ పోతే మన దేసంలోనే మనం మైనారిటీలో పడిపోతామని ఆయన అన్నారు. శివసేన ప్రకటనను ఇతర పార్టీల నాయకులు తప్పు పట్టారు. అర్థరహితమైన ప్రకటనగా ఆ పార్టీలు కొట్టిపారేశాయి.  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మత ఉద్రిక్తతలను పెంచడానికి శివసేన ప్రయత్నించడం సిగ్గుచేటయిన విషయమని కాంగ్రెసు నేత రీటా బహుగుణ జోషీ అన్నారు. పది మంది పిల్లలను కనడం మహిళలకు అత్యంత వేదనాభరితమైన పని అని, శివసేన కేవలం 21 వేల రూపాయలు మాత్రమే ఇస్తానంటుందని, శివసేన ఆలోచన తప్పే అయినా అటువంటి కుటుంబాలకు 21 లక్షల రూపాయలేసి ఇవ్వాలని తాను అడుగుతున్నానని ఎస్పీ మాజీ నేత, జర్నలిస్టు షాహిద్‌ సిద్దిఖి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభాను తగ్గించుకోవాలని చూస్తుంటే శివసేన పెంచాలని చెబుతోందని ఆయన అన్నారు. శివసేన ప్రకటనను తప్పు పడుతూ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: