అధ్వానికి మళ్ళీ అవమానం

Chowdary Sirisha
పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీకి మోడీ ప్రభుత్వం నుంచి అవమానాలు కొనసాగుతున్నాయి. సాంసృతిక మండలి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలన్న అద్వానీ అనుచరుల అభిప్రాయాన్ని కూడా మోడీ తొసిపుచ్చుతున్నారు. పార్లమెంటరీ పార్టీ నుంచి తొలగించారు. ఎన్డీయే చైర్మన్‌ పదవీ లేదు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ అద్యక్ష పదవి అద్వానీకి కట్టబెట్టాలని బీజేపీలోని కొందరు నాయకులు వాదిస్తున్నారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను దేశ విదేశాలకు తీసుకెళ్లి భారత ప్రతిష్టను పెంచడం ఈ ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ బాధ్యత. సుదీర్ఘ రాజకీయానుభవం.. ప్రపంచదేశాల్లోని ప్రముఖులతో పరిచయాలున్న అద్వానీ దీనికి సమర్ధుడిగా ఆయన వర్గం భావిస్తోంది. ఆయనకే ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దల వద్ద కూడా ప్రతిపాదనలు పెట్టారు. కానీ మోడీ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. రాజకీయ పరిజ్ఞానం పరిమితంగా ఉండి.. సంస్కృతి పట్ల అవగాహన ఉన్న మహిళా ఎంపీకి ఈ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. చంఢీగడ్‌ ఎంపీ, నటి కిరణ్‌ఖేర్‌ ఈ పదవికి పోటీ పడుతున్నారు. మోడీ వద్ద లాబీయింగ్‌ చేస్తున్నారు. ప్రధాని కూడా ఆమెకే ఈ బాధ్యతలు అప్పగించడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. అద్వానీకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని.. దేశ విదేశీ ప్రయాణాలు చేయడానికి ఆయన వయసు, ఆరోగ్యం సహకరించకపోవచ్చని సాకుగా చూపుతున్నారు. మోడీ తీరుపై అద్వానీ వర్గం మండిపడుతోంది. గతంలో పార్లమెంట్‌లో గది లేకుండా చేశారు. యాక్టింగ్‌ ఎన్డీయే ఛైర్మన్‌గా ఉన్న వృద్ధనేతపై కనీస గౌరవాన్ని చూపించలేదు. విధానపర నిర్ణయాలు తీసుకునే అత్యున్నత పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. ఎన్టీయే కన్వీనర్‌ హోదా లేకుండా చేశారు. కనీసం గౌరవంగా ఉంటుందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ ఛైర్మన్‌ పోస్టు అడిగితే కూడా అడ్డుకోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. పార్టీకి పదేళ్లుగా అధికారం లేకపోయిననా.. అందరి నుంచి గౌరవం పొందిన ఈ సీనియర్‌ నేతకు.. అధికారం వచ్చాక అవమానాలే ఎదురవుతున్నాయి. అద్వానీతో పాటు.. అర్ధశతాబ్ధానికి పైగా రాజకీయ అనుభవమున్న మురళీమనోహర్‌ జోషీకి ఈ అవమానాలు తప్పడం లేదు. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా, మౌనంగా భరిస్తున్నారు. వీరితో పాటు కొందరు మంత్రుల్లో ఉన్న అసంతృప్తి ఎప్పుడొ ఒకప్పుడు లావాలా ఎగిసిపడుతుందని పార్టీ వర్గాలంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: