రాష్ట్రంలో చురుగ్గా రుతుపవనాలు

Chowdary Sirisha
ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిసా నుంచి కోస్తా మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడనద్రోణి దీనికి తోడైంది. ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత చురుగ్గా మారడం ఇదే ప్రథమం. కాగా ఆదివారం ఉదయంతో ముగిసిన 24 గంటల కాలంలో తిరుమలలో 11; కొనకమిట్ల, పోరుమామిళ్లలో 9; పుత్తూరు, తిరుపతిలో 6; శ్రీకాళహస్తి, మంథని, భూపాలపల్లి, తడ, గుంటూరులలో 5; బొండపల్లి, నెల్లిమర్ల, పూసపాటిరేగ, వెంకటాపురం, హైదరాబాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో రైతులు కొంతమేర ఊరట చెందుతున్నారు. ఆదివారం కూడా ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగిందని వాతావరణశాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో కోస్తా, రాయలసీమలో, బంగాళాఖాతంలో మేఘాలు ఆవరించాయి. ఫలితంగా దక్షిణకోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీలో పలుచోట్ల, కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: