దసరా నాడు 'జమ్మిచెట్టు, పాలపిట్ట' సందర్శనం సర్వశుభదాయకం

విజయదశమి లేదా దసరా పండుగ విశిష్టత గురించి పుంఖాను పుంఖాలుగా కథలు కథనాలు రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఆసేతు శీతాచల భారతం ఈ దసరా పండుగను అత్యంత శోభాయమానంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది త్రేతాయుగ కాలంలో రావణుడిపై రాముడి విజయం అంటే చెడుపై మంచి పైచేయి సాధించిన రోజు.  అలాగే ద్వాపరయుగ కాలంలో కౌరవులపై పాండవులు విజయం అంటే చెడుపై మంచి పైచేయి సాధించిన రోజు  అందుకే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో దసరాని జరుపు కుంటారు.


తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో, మహిషాసురుని అంత మొందించి, ఆ ఆదిపరా శక్తి స్వరూపంలోని అమ్మ - దేవీమాత - దుర్గమ్మ తల్లి విజయం సాధించినందుకు విజయదశమిని జరుపుకుంటారు. అయితే, ఈ పర్వదినాన రెండు ముఖ్యమైన సాంప్రదాయ, సాంస్కృతిక ఆచారాలు అనుసరిస్తూ వస్తున్నారు భారతీయులు.

 

1 పాలపిట్ట సందర్శనం

2 జమ్మి చెట్టుని పూజించటం.

 

పాలపిట్ట సందర్శనం: విజయదశమి రోజున నీలి, తెలుపు వర్ణసంశోభితమైన పాల పిట్టను చూడగలగటం ఒక అదృష్ట సూచికగా, శుభశకునంగా భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే, పాలపిట్ట గుర్తుకు వస్తుంది. గుప్పెడంత ఈ గువ్వ పిట్టకు విజయదశమి రోజున నమస్కరించాల్సిందే. ఆ శుభదినాన పాలపిట్ట సందర్శనం జరిగితే అంతా శుభమే జరుగుతుందని ఒక విశ్వాసం. పాలపిట్ట సందర్శన తరవాత తలపెట్టిన ప్రతీ పని విజయవంత మవుతుందనేది జనవిశ్వాసం.


అసలు పాలపిట్టను దసరా నాడే ఎందుకు దర్శించాలి? అనే సందేహానికి దీనికి చారిత్రక సమాధానం ఉంది. అదే మంటే అతి క్లిష్టమైన అజ్ఞాతవాసాన్ని - అరణ్య వాసాలను భగవానుడు శ్రీకృష్ణుని ఆశీస్సులతో విజయవంతంగా ముగించుకుని వస్తున్న పాండవులకు తమ రాజధాని హస్తినాపురం పొలిమేరలో ఈ పాలపిట్ట కనపడిందట. అప్పటి నుంచే వారికి విజయాలు  సిద్ధించటం ప్రరంభమయ్యాయట. ఈ అందాల పాలపిట్ట సందర్శనమే సఖల జయాలకు మూలమని వారు నమ్మారట. అప్పటి నుండే ఆనాటి జనపదాల నుండి నేటి జనారణ్యాలవరకు "విజయదశమి రోజున పాలపిట్టను చూడటం" ఒక ఆనవాయితీగా మారింది.


దసరా పర్వదినం సమయాన పాలపిట్టను దర్శించుకోవడం, నమస్కరించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పాలపిట్ట దేవీమాత  స్వరూపమని, అది ఉత్తర దిక్కునుంచి వస్తే శుభం, విజయం కలుగుతాయని. దక్షిణ దిశగా వస్తే అశుభ సంకేతమని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తుంటారు. ఏదేమైనా అసలు దాని సందర్శనమే అత్యంత శుభదాయకం అంటారు జ్ఞానవిజ్ఞానకోవిదులు.


దీన్ని ఇంగ్లీష్ లో “ఇండియన్ రోలర్” లేదా “బ్లూ జే” అంటారు. దీని శాస్త్రీయ నామం: కార్వుస్ బెంగాలెన్సిస్

దీన్ని తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రపక్షి గా గుర్తించింది. అయినా ప్రస్తుతం ఈ పక్షి జాడలెక్కడా కనిపించటం లేదు. చాలా ప్రాంతాల్లో ఈ పక్షులు కనుమరుగై పోయాయి. కారణం సెల్ టవర్స్ అంటారు వీటి వల్ల జనించే విద్యుదయస్కాంత తరంగాల మూలంగా ఈ పాల పిట్టలు కనుమరుగు అవుతున్నాయనేది శాస్త్రవేత్తల భావన. పచ్చనిచెట్లు పెంచటం ద్వారానే ఈ పరిస్థితిని నివారించగలం. అప్పుడే శుభాలనిచ్చే పాలపిట్టనూ కాపాడుకోగలం. ఈ పక్షులను సంరక్షించాల్సిన బాధ్యత ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. 

 

జమ్మి చెట్టుని పూజించటం:  'జమ్మిచెట్టు'అంటే శమీవృక్షమే. అజ్ఞాతవాసానికి సమాయత్తమౌతున్న వేళ పాండవులు వారి వారి ఆయుధములను, వారి రాచనగరు వస్త్రాభరణాలను, అలంకారాలను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్షను పూజించి, ప్రార్ధించి, తిరిగి ఆయుధములను, వస్త్రములను స్వీకరించి - శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు.


"శ్రీ రాముడు" ఈ విజయ దశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి పదితలల రావణుని సంహరించి, విజయము పొందాడు. అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి వెంటనే తనలోని - నిద్రించిన శక్తిని (అపరాజితా దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది.


శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానమెక్కి అయోధ్యకు బయల్దేరే ముందు శమీ వృక్షాన్ని పూజించాడు. “శమీ శమైతే పాపం - శమీ శత్రు వినాశనం - అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం” అంటూ శనీవృక్షానిక నమస్కరిస్తే సరి శనిదోషం కూడా తొలిగి సమస్త విజయాలు సిద్ధిస్తాయనేది పురాణకాలం నుండి భారతీయుల విశ్వాసం.


అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. జమ్మి చెట్టుని ఆంగ్లంలో “ప్రోసొపిస్” అంటారు దీని శాస్త్రీయ నామం: ప్రోసొపిస్ సినీరారియా


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: