ఏపీలో ఆ రెండు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరుస్తుందా... డౌటేనా...!

VUYYURU SUBHASH
ఏపీలో మరో నాలుగు రోజుల్లో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో అధికార టీడీపీ కంచుకోటలు బద్దలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాప కింద నీరులా అనేక జిల్లాల్లో ఆధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేఖత స్పష్టంగా వ్యక్తం అవుతోంది. రాయలసీమ జిల్లాల పేరు చెబితేనే వైసీపీకి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో ఒక్క అనంతపురం జిల్లా మినహా మిగిలిన సీమ జిల్లాలు అయిన కడప, కర్నూలు, చిత్తూరులో వైసీపీ స్పష్టంగా తన సత్తా చాటింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇప్పటికి టీడీపీ కోలుకునే పరిస్థితి లేదంటే అక్కడ వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో తెలుస్తోంది. రాయలసీమలో ఎవరిని కదిలించినా ఆ సారి వైసీపీకి ఓటు వేస్తామని ఘంటా పథంగా చెబుతున్నారు. ఆ సారి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కావడమే తమ లక్ష్యమని, జగన్‌కు ఓ ఛాన్స్‌ ఇచ్చి చూస్తామని వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గ్రాఫ్‌ ఎన్నికలకు ముందు అమాంతంగా పెరుగుతూ వస్తోంది. 


ఎన్నిక‌ల‌కు ముందు వెలువడుతున్న ప్రీ పోల్‌ అంచనాలు, ముందస్తు సర్వేలను బట్టి చూస్తే రెండు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరుస్తుందా లేదా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం విపక్ష వైసీపీ వాళ్లు, పలు సర్వే సంస్థలు చెప్పడం కాదు టీడీపీ వాళ్లు సైతం ఆ రెండు జిల్లాల్లో తమ పార్టీ ఖాతా తెరిచినా గొప్పే అని భావిస్తున్నారు. ఎంత విచిత్రం అంటే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కడపలో వైసీపీ ఆధిక్యం కనపరిచిందంటే పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇటు సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైసీపీ గత ఎన్నికల్లోనే కాదు ఈ సారి కూడా టీడీపీ కంటే మెజారిటీ స్థానాలు సాధించనుంది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ 2009లో వైఎస్‌ దెబ్బకు, గత ఎన్నికల్లో జగన్‌ దెబ్బకు కడప జిల్లాలో టీడీపీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. 
2009లో ప్రొద్దుటూరు సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ గత ఎన్నికల్లో రాజంపేటలో గెలిచినా ఆ ఎమ్మెల్యేను కూడా నిలబెట్టుకోలేకపోయింది.


రాజంపేటలో టీడీపీ తరపున గెలిచి విప్‌గా పని చేసిన మేడా మల్లికార్జున రెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్‌ చేసి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే వైసీపీ వేవ్ స్ట్రాంగ్‌గా ఉండడంతో జగన్‌ సొంత జిల్లా కడపలో టీడీపీ రెండు స్థానాలు మినహా మిగిలిన స్థానాలపై ఆశలు వదిలేసుకుంది. ఆ రెండు స్థానాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలవడంతో జ‌మ్మ‌ల‌మడుగుపై కాస్తో కూస్తో టీడీపీకి ఆశ ఉన్నా వాస్తవంగా అక్కడ గ్రౌండ్‌ రిపోర్ట్‌ చూస్తే వైసీపీ మంచి మెజారిటీతో ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రైల్వేకోడూరులో టీడీపీకి ఆశ ఉన్నా అక్కడ ఇప్పటికే హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా పేరున్న శ్రీనివాసులపై టీడీపీ విజయం సాధించడం అంత సులువు కాదు.


నెల్లూరులోనూ వైసీపీ స్వీపేనా..?
ఇక వైసీపీ చాలా స్ట్రోంగా ఉన్న నెల్లూరు జిల్లాలో టీడీపీ గత ఎన్నికల్లో మూడు సీట్లలో మాత్రమే గెలిచింది. ఆ మూడు సీట్లలో ఉదయగిరిలో 1800, వెంకటగిరిలో 4,500, కోవూరులో 2,300 మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. చంద్రబాబు గత నాలుగు ఎన్నికల్లో ఓడిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వడం, నారాయణకు సైతం ఎమ్మెల్సీ ద్వారా మంత్రి ఇవ్వడంతో ఈ ఇద్దరు మంత్రులు ప్రజలకు దూరం అయ్యారన్న అపవాదు కూడా ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టీ చూస్తే టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వ్యతిరేఖత ఉండడంతో పాటు వైసీపీ నుంచి గెలిచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలపై సైతం ప్రజల్లో అంత సానుకూలత లేదు. నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ ఒకటి రెండు సీట్లు గెలిస్తే చాలా గొప్ప అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఏదేమైన ఈ రెండు జిల్లాల్లో వైసీపీ ముందు టీడీపీ ఎంతలా బేజారు అవుతుందో ? ఆ రెండు జిల్లాల్లో టీడీపీ వర్గాల్లో ఎలాంటి నిర్వేదం అలుముకుందో ఆ పార్టీ వాళ్లే చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: