ఎడిటోరియల్ : కోడెలకు ఇంత అవమానమా ?

Vijaya

ఇంతటి అవమానం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనుండరు. దాదాపు 70 ఏళ్ళకు దగ్గరలో ఉన్న ఆయన సొంతపార్టీ నేతల నుండి ఇంతటి పరాభవం ఎదురవుతుందని ఊహించుండరు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించో ఈపాటకే అర్ధమైపోయుంటుంది. అవును ఆయనే కోడెల శివప్రసాదరావు. ఎన్నికల సమయంలో తన టికెట్ కోసమే చంద్రబాబునాయుడుతో ఇంతటి పోరాటం చేయాల్సొస్తుందని కోడెల ఊహించుండరు. సరే ఈ పరిస్ధితి స్వయంకృతమే అనుకోండి అది వేరే సంగతి.

 

ఐదేళ్ళు స్పీకర్ గా పనిచేసిన కోడెల వ్యవస్ధ గబ్బు పట్టిపోయినా పర్వాలేదు, ఎవరెవమనుకున్నా నష్టంలేదని వైసిపి ఎంఎల్ఏల అణిచివేతే టార్గెట్ గా పెట్టుకున్నారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే చేశారన్న విషయం అందరికీ తెలుసు. టిడిపిలోకి ఫిరాయించిన తమ ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసినా, రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయటం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చంద్రబాబు కోసం పనిచేయక తప్పలేదు. చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలున్నాయో స్పీకర్ పైన కూడా అన్నే ఆరోపణలుండటం గమనార్హం.

 

పార్టీ ప్రయోజనాల కోసం స్పీకర్ వ్యవస్ధను సైతం గబ్బుపట్టించిన కోడెలకు చివరి వరకూ చంద్రబాబు టికెట్ ఖరారు చేయలేదంటే స్పీకర్ కు ఇంతకన్నా అవమానం ఏమన్నా ఉందా ? అదే సమయంలో సత్తెనపల్లిలోని పార్టీ నేతలు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే కోడెలకు టికెట్ ఇవ్వద్దని తీర్మానం చేశారంటే స్పీకర్ పై ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉందో అర్ధమవుతోంది. కోడెలను అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరాచకాలు చేశారంటూ పార్టీ నేతలు, జనాలు మండిపోతున్నారు.

 

కోడెలకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ర్యాలీలు, ధర్నాలు చేశారంటేనే తెలిసిపోతోంది ఆయన పరిస్దితేంటో. ఏపని చేయాలన్నా చివరకు పార్టీ నేతల దగ్గర కూడా డబ్బులు వసూళ్ళు చేసేవారట. పార్టీకి, రెండు నియోజకవర్గాలకు కోడెల కుటుంబం పీడ వదలాలని పార్టీ నేతలు, జనాలు రెండు నియోజకవర్గాల్లోని రోడ్లను శుభ్రంచేసి పసుపునీళ్ళతో శుద్ది చేశారంటే కోడలకు ఇంతకన్నా అవమానం ఇంకోటుందా ?

 

ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్న తర్వాత  రేపటి ఎన్నికల్లో కోడెల గెలుపు అనుమానమే. నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ కోడెల కుటుంబం పార్టీని గబ్బుపట్టించేసినట్లు మండిపడుతున్నారు. రేపటి ఎన్నికల్లో కోడెల గెలవరంటూ బహిరంగంగానే చెబుతున్నారు. అదే సమయంలో కోడెలకు టికెట్ ఇస్తే ఓడగొడతామంటూ పార్టీ నేతలే బహిరంగంగా చంద్రబాబును హెచ్చరించటం గమనార్హం. అయినా సరే సత్తెనపల్లిలో పోటీ చేయబోతున్న కోడెల భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: