అలీ వైసీపీలో చేరడానికి.. కేసీఆర్ బెదిరింపులే కారణమా..?

Chakravarthi Kalyan
ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రతి విషయాన్నీ కేసీఆర్‌తో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చివరకు కమెడియన్ అలీ వైసీపీలో చేరడం కూడా కేసీఆర్ బెదిరింపుల కారణంగానే అంటోంది టీడీపీ. ఉదయం 11గంటలకు చంద్రబాబు వద్దకు వస్తానని ఆలీ తనతోనే చెప్పారని, కేసీఆర్ బెదిరింపులతో జగన్ వద్దకు వెళ్లి, వైకాపాలో చేరారని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు.  



చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న వ్యక్తి ఆలీ అని ఆయన అన్నారు. జగన్ తన పార్టీ వైసీపీని కేసీపీగా మార్చారని బుద్దా వెంకన్న ఎద్దేవాచేశారు. మోడీ -కేసీఆర్ ఒత్తిడి తెచ్చి మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు పెట్టించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రత్యర్ధుల కుట్రలు ఎలా ఉన్నా.. ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టంచేశారు. 



ప్రతిపక్షాలను పడగొట్టడానికి తెదేపాకున్న ఆయుధాలు ప్రజలే అన్న బుద్దా అభివృద్ధి-సంక్షేమం చంద్రబాబు చరిత్ర అయితే.. జైలు జీవితం-అవినీతి జగన్ చరిత్ర అని కామెంట్ చేశారు. అయితే బుద్దా వెంకన్న ఇలా అంటుంటే.. మరో నేత నాగుల్ మీరా మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆలీని తాము  తిరస్కరించాక జగన్ పంచన చేరారని కామెంట్ చేశారు. 


అలీ కోరుకుంటున్న స్థానంలో ఆయన్ను నిలబెడితే ఓడిపోతామని మా సర్వేలో తేలిందని నాగుల్ మీరా చెప్పుకొచ్చారు. ఆలీ అభ్యర్ధిగా ప్రకటిస్తే ఆ సీటులో ఓటమి తప్పదని తేలిందన్నారు. అందుకే అలీకి తాము టికెట్ ఇవ్వలేదని.. ఆ తరవాతే అలీ వైసీపీలో చేరారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ముస్లిం, ఒక్క మైనార్టీ ఓటు కూడా వైసీపీకి వేయరని మీరా  దుయ్యబట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: