ఎడిటోరియల్ : నెల్లూరు టిడిపిలో నాలుగు స్ధంబాలాట

Vijaya

నెల్లూరు జిల్లాలో నాలుగు స్తంబాలాట జోరుగా సాగుతోంది. నెల్లూరు ఎంపిగా నువ్వు పోటీ చేయమని అంటే కాదు నువ్వే పోటీ చేయమంటూ నేతలు ఒకరిపై మరొకరు తోసేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపిగా పోటీ చేయటానికి నేతలెవరూ సిద్ధంగా లేరు. అందుకే ఎంపి అభ్యర్ధిగా ఇప్పటికి నలుగురు మారారు.  ఇంకెతమంది నేతల పేర్లు తెరపైకి వస్తాయో తెలీదు.

 

ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా జిల్లాలో కీలకమైన నెల్లూరు ఎంపి స్ధానంలో ఎవరిని పోటీలోకి దింపాలన్న ఆలోచనతో  చంద్రబాబు బుర్ర వేడెక్కిపోతోంది. ముందుగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఆదాల ప్రకటించారు. తర్వాత మాజీ ఎంఎల్ఏ బీద మస్తాన్ రావును రంగంలోకి దింపారు.

 

కొద్ది రోజులు మస్తాన్ రావే ఎంపి అభ్యర్ధి అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో మస్తాన్ రావు కూడా తప్పుకున్నారు. ఆ తర్వాత వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెరపైకి వచ్చారు. కారణాలు సరిగా తెలీదుకానీ బొమ్మిరెడ్డి పేరు కూడా వెనక్కుపోయింది.

 

తాజాగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు నలుగుతోంది. అసలు పార్టీలోనే ఉంటారో ఉండరో కూడా తెలీని మాగుంటను నెల్లూరు ఎంపిగా పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచించటమే విచిత్రంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఎంల్సీగా ఉన్న మాగుంటను గతంలో ఒంగోలు ఎంపిగా పోటీ చేయించేట్లు చంద్రబాబే ఒప్పించారు. మళ్ళీ ఇంతలోనే ఒంగోలు లేకపోతే నెల్లూరయినా సరే అన్నట్లు టిడిపి చెబుతోంది.

 

అసలు నెల్లూరు ఎంపిగా పోటీ చేయటానికి ఇంతమంది పేర్లు ఎందుకు చంద్రబాబు పరిశీలిస్తున్నారు ? ఎందుకంటే, వైసిపి అభ్యర్ధిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఆయన్ను ఢీ కొనాలంటే కష్టమని అందరికీ తెలుసు. కాబట్టి ఓడిపోయే సీటులో ఎందుకు పోటీ చేయాలి ? అన్నదే టిడిపి నేతల భవాన. ఎంపిగా పోటీ అంటే తక్కువలో తక్కువ రూ 100 కోట్లన్నా ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెట్టినా గెలుపుపై నమ్మకం ఉంటే సరి లేకపోతే ఎవరు ముందుకొస్తారు ? టిడిపిలో ఇపుడదే జరుగుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: