ఎడిటోరియల్ : ఢిల్లీ దీక్ష సరే..కొత్తగా ఏం సాధించారు ?

Vijaya

అందరిలోను ఇపుడిదే ప్రశ్న మొదలైంది. ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా ఏపి భవన్లో దీక్ష చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఏం  సాధించారనే విషయంలోనే ఎవరిలోను క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్రప్రభుత్వానికి గట్టిగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడికి వ్యతిరేకంగా దీక్షలు చేయటం ఇదే తొలిసారి కాదు. ఏపి భవన్లో చేసిన ధర్మపోరాట దీక్షలు రాష్ట్రంలో దాదాపు 10 వరకూ చేశారు. ఎక్కడ దీక్ష చేసినా, ఎప్పుడు చేసినా అదంతా ప్రజల డబ్బే. కోట్ల రూపాయల ప్రజాధానాన్ని సొంత ఇమేజి బిల్డప్ చేసుకోవటం కోసం దుర్వినియోగం చేసినట్లే.

 

ఢిల్లీలో జరిగిన తాజా దీక్షకోసం అక్షరాల రూ. 10 కోట్లు వ్యయం అయ్యిందట. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లకు విమాన టిక్కెట్లు, ఇతర స్ధాయి నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులకు విమానా, ట్రైన్, ప్రత్యేక బస్సులు, ఢిల్లీలో బస, రవాణా తదితరాల కోసం కోట్ల రూపాయలు ఖర్చయింది. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం చేసిన నిరసన కాబట్టి వాడిందంతా ప్రభుత్వ డబ్బే.  ఎందుకో తెలీదుకానీ ఏ చిన్న కార్యక్రమం చేసినా చాలా ఆర్భాటంగా చేస్తున్నారు చంద్రబాబు. అప్పుడూ మోడిని, జగన్మోహన్ రెడ్డినే తిట్టారు. ఇపుడూ మోడినే తిట్టారు.

 

అందులో భాగమే ఢిల్లీ దీక్ష కూడా. ఇటువంటి దీక్షలు రాష్ట్రంలో చేసినపుడు కూడా భారీ ఎత్తునే చేశారు. రాష్ట్రంలో జరిగిన ధర్మపోరాట దీక్షలకు సుమారుగా రూ.30 కోట్లు ఖర్చయ్యుంటుందని అంచనా. తాజా ఢిల్లీ ఖర్చు దానికి అదనం. రాష్ట్రంలో చేసిన పోరాటాలకు తాజా ఢిల్లీ పోరాటం వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే లేదనే చెప్పాలి. నాలుగు సంవత్సరాల పాటు ప్రత్యేకహోదాను తీవ్రంగా వ్యతిరేకించిన ఘనడు చంద్రబాబు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేముందు యుటర్న్ తీసుకుని ప్రత్యేకహోదా కోసం తానే మొదటి నుండి పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తే ఎవరు ఒప్పుకుంటారు ?

 

రాష్ట్రంలో జరిగిన ధర్మపోరాట దీక్షలకు ఢిల్లీ దీక్షకు ఒకటే తేడా. రాష్ట్రంలోని దీక్షలకు జాతీయ పార్టీల అధినేతలెవరూ హాజరుకాలేదు. ఢిల్లీలో ఏపి భవన్ దీక్షకు కొందరు హాజరయ్యారంతే. విజయవాడలో చేసిన దీక్షకే అందరు వస్తారని స్వయంగా చంద్రబాబే చెప్పినా ఎవరూ హాజరుకాలేదు. ఇపుడు మాత్రం ఎందుకు హాజరయ్యారు ? ఎందుకంటే, చాలామంది జాతీయ పార్టీల అధినేతలుండేది ఢిల్లీలోనే కాబట్టే ఏపి భవన్ కు వచ్చి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు.

 

సరే, చంద్రబాబు దీక్షలు మోడి సర్కార్ ను ఏమైనా కదిలించిందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే, కారణాలేవైనా కానీండి ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని మోడి గట్టిగా అనుకున్నారు కాబట్టే ఇవ్వలేదు. అదే రేపటి రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంపిల బలం తగ్గిపోయి అప్పుడు ఏపిలో మ్యాగ్జిమం ఎంపి సీట్లు తెచ్చుకునే పార్టీ మద్దతు అవసరం అయితే రేపటిరోజున హోదా ఇస్తారేమో తెలీదు చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: