జయరాం మర్డర్ వెనుక ‘పోలీస్’ గైడెన్స్..!!?

Vasishta

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాంను తానే మర్డర్ చేశానని రాకేష్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసిందే! అయితే రాకేష్ రెడ్డికి కొందరు పోలీసులు కూడా సహకరించారనేది తాజా వార్త. ఈ కేసు నుంచి బయటపడేందుకు రాకేష్ రెడ్డి కొంతమంది పోలీసుల సాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వారిపై బదిలీ వేటు పడింది..!


పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ హత్య చేసింది తానేనని రాకేష్ రెడ్డి అంగీకరించారు. తాను జయరాంను చంపాలనుకోలేదని, అయితే ఒక్క దెబ్బకే తాను చనిపోయాడని రాకేష్ వాంగ్మూలమిచ్చాడు. అనంతరం అతని డెడ్ బాడీని నందిగామ తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశానని చెప్పేశాడు. అయితే ఈ స్కెచ్ వెనుక ఇద్దరు పోలీసుల హస్తం ఉందనేది తాజా వార్త.


జయరాంను కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన మధ్యాహ్నం జరిగింది. జయరాం చనిపోయాడనే విషయం నిర్ధారించుకున్న తర్వాత రాకేష్ రెడ్డి తన సన్నిహితులైన ఇద్దరు పోలీసులకు కాల్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. వాళ్లతో ఏం మాట్లాడారనేదానిపై కాలే డేటా తెప్పించుకున్నారు పోలీసులు. అదే సమయంలో రాకేష్ రెడ్డిని కూడా తమదైన శైలిలో విచారించడంతో పూర్తిగా బయటపెట్టేశాడు. జయరాం చనిపోయాడనే విషయం నిర్ధారించుకున్న తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డికి రాకేష్ రెడ్డి కాల్ చేశాడు. ఆయన సలహా మేరకే జయరాంది యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.


అంతేకాక.. ఓ ఇన్ స్పెక్టర్ తో కూడా రాకేష్ రెడ్డి టచ్ లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆయన్ను కూడా ఏ చేయాలనేదానిపై సంప్రదించినట్టు తెలిసింది. ఇటు ఇన్ స్పెక్టర్, అటు ఏసీపీల గైడెన్స్ తో జయరాం డెడ్ బాడీని ఏపీకి తీసుకొచ్చాడని తెలుస్తోంది. నందిగామ సమీపంలోకి తీసుకొచ్చి యాక్సిడెంట్ లాగా ఆ సీన్ క్రియేట్ చేయాలనేది ఆ పోలీసులు ఇచ్చిన సలహానే..! దాన్నే రాకేష్ రెడ్డి పక్కాగా అమలు చేశాడు. అయితే ఈ విషయం కాల్ డేటాలో బయటపడింది. రాకేష్ రెడ్డికి సలహాలిచ్చారనే విషయం ధృవీకరణ కావడంతో ఆ ఇద్దరు పోలీసులపై బదిలీ వేటు వేసింది తెలంగాణ ప్రభుత్వం.


మరోవైపు జయరాం హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. రాకేష్ రెడ్డి మాత్రమే దీనికి పాల్పడ్డాడా.. లేకుంటే శిఖా చౌదరి పాత్ర కూడా ఉందా.. అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరాం హత్య బంధువుల కుట్రేనని ఆయన భార్య పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిఖా పాత్రపైనా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మర్డర్ చేసిన తర్వాత రాకేష్ రెడ్డి  వెంటనే శిఖా చౌదరికి కాల్ చేసి జరిగిన విషయం చెప్పడం.. వెంటనే ఆమె జయరాం ఇంటికొచ్చి తన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకెళ్లడం.. పద్మశ్రీ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈ కేసులో నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: