ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్ని ఎత్తులో..!!?

Vasishta

          ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్.. మరో రెండు నెలల్లో ప్రజాతీర్పు కోసం పార్టీలు వెళ్లబోతున్నాయి. అధికారమే పరమావధిగా పార్టీలన్నీ ఎత్తులు వేస్తున్నాయి. ఇక అధికారంలోని పార్టీలైతే మరింత జోష్ తో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకెళ్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ప్రజలకు వరాల వర్షం కురిపిస్తున్నారు.


          చంద్రబాబు పాలన ప్రజా సంక్షేమానికి వ్యతిరేకమనేది గతంలో ఆయన పాలన చూసినవాళ్లంతా చెప్తారు. హైటెక్ బాటలో పడి ఆయన ప్రజలను పట్టించుకోలేదని, అందుకే ఆయన ఓడిపోయారని విశ్లేషకులు చెప్పినమాట. అయితే నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబులో చాలా మార్పే కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆయన ప్రజలపై భారం మోపేందుకు ఏమాత్రం సాహసించలేదు. పన్నులు పెంచలేదు, కరెంటు చార్జీలు పెంచలేదు, ఆర్టీసీ చార్జీలు పెంచలేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.. పైగా మరిన్ని తాయిలాలను అందించారు. బిడ్డ కడపుతో ఉన్నది మొదలు చనిపోయిన అనంతరం కూడా ప్రయోజనాలు కల్పించేలా పలు పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారు. ఇటీవలే దానికి సంబంధించిన ప్రచార చిత్రం కూడా విడుదల చేశారు.


          ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. గత ఎన్నికలకు, గతంలో అనుసరించిన పంథాలకు భిన్నంగా ఈసారి చంద్రబాబు సంక్షేమ పథకాలనే నమ్ముకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చినప్పుడు రూ.200 ఉన్న పెన్షన్ ను వెయ్యి రూపాయలు చేశారు. తాజాగా దాన్ని రూ.2000లకు పెంచారు. అంటే పది రెట్లు అధికం. ఇక రుణమాఫీ, అన్న క్యాంటీన్లు, చంద్రన్నబీమా, ఎన్టీఆర్ విద్యోన్నతి, ఆరోగ్యబీమా, ఉద్యోగులకు జీతాల పెంపు, పారిశ్రామిక పురోగతి, పోలవరం, పట్టిసీమ, విదేశీ పెట్టుబడులు.. ఇలా ఎన్నో స్కీమ్ లను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవన్నీ సత్పలితాలిస్తున్నాయని నమ్ముతోంది.


          వీటికి తోడు తాజాగా మరిన్ని వరాలు కురిపిస్తున్నారు చంద్రబాబు. అన్నదాతా సుఖీభవ పేరుతో రైతులకు నేరుగా లబ్ది చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. డ్వాక్రా మహిళలకు రూ.10వేల రూపాయల విలువైన చెక్కులు ఇచ్చారు. ఇవన్నీ ఎన్నికల సమయంలోనే ప్రజలకు చేరబోతున్నాయి. కోడ్ అమల్లోకి రాకముందే వీటన్నింటినీ ప్రజలకు చేర్చేందుకు ప్లాన్ వేశారు. ఎందుకంటే కోడ్ అమల్లోకి వచ్చాక ఇవి అమలు చేసేందుకు ఎన్నికల నిబంధనలు అడ్డొస్తాయి. అందుకే ఈలోపే వీలైనంతమందికి చేరువయ్యేందుకు బాబు ప్లాన్ వేశారు. మరి చంద్రబాబు ప్లాన్లు ఏమేరకు వర్కవుట్ అవుతాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: