ఎడిటోరియల్ : ఏపి ఎన్నికలపై తెలంగాణా బృందం సర్వే

Vijaya

మొన్నటి వరకూ తెలంగాణా ఎన్నికలపై హీట్ పెంచేసిన సర్వేలు తాజాగా అదే హీట్ ను ఏపి ఎన్నికల్లో కూడా పెంచేస్తున్నాయి. ఏపి ఎన్నికలపై తెలంగాణాకు చెందిన బృందాలు సర్వేలు చేయటం తాజా సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయో తెలుసుకునేందుకు ఇఫ్పటికే అనేక జాతీయ మీడియా సంస్ధలు సర్వేలు చేసిన విషయం తెలిసిందే. ఏపి ఎన్నికలు ఇంకా ఆరు మాసాలుండగానే ఎన్నికల వేడి రాజుకుందంటే అందుకు జాతీయ మీడియాలు చేసిన సర్వేలే కారణమని చెప్పాలి.

 

అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు. సర్వే ఫలితాలన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. పొలిటికల్ హీట్ పెరిగిపోవటానికి ఇంతకన్నా మసాలా ఇంకేం కావాలి జనాలకు. జాతీయ మీడియా సంస్ధలు చేసిన సర్వేలు అలా ఉండగానే చంద్రబాబు, జగన్ విడివిడిగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. సరే వారు చేయించుకుంటున్న సర్వే ఫలితాలు బయటకు వచ్చే అవకాశాలు లేవులేండి. ఇదిలా వుండగానే తాజాగా ఏపిలో ఓ బృందం చేస్తున్న సర్వే బయటపడటంతో రాజకీయంగా కలకలం రేగింది. అదికూడా జగన్ సొంతజిల్లా కడపలో అందులోను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సర్వే అంటే ఇక చెప్పేదేముంది .

 

ప్రొద్దుటూరులోని 1వ వార్డులో కొందరు యువకులు రెండు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్న విషయం స్ధినికుల ద్వారా బయటకు పొక్కింది. తెలంగాణా జిల్లాల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సర్వే చేస్తు ఏపి పోలీసులు తెలంగాణా పోలీసులకు దొరకటం ఎంత సంచలనమైందో  అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏపి పోలీసులు చేస్తున్న సర్వేలపై కెసియార్ అండ్ కో చంద్రబాబుపై ఎంతగా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ విషయంపై స్వయంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ జోక్యం చేసుకోవాల్సొచ్చింది.

 

గవర్నర్ దెబ్బకు ఏకంగా ఏపి డిజిపినే రంగంలోకి దిగి తెలంగాణా ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకున్నారు. సర్వేలు తప్పేమీ కాదు కానీ ఏపి పోలీసులు మహాకూటమి అభ్యర్ధులకు అనుకూలంగా ఓటర్లను ప్రలోబాలకు గురిచేస్తున్నారంటూ కెసియార్, కెటియార్, హరీష్ తదితరలు చంద్రబాబు అండ్ కోపై బాగా విరుచుకుపడటంతో అనవసర రబస చెలరేగింది. అదే పద్దతిలో తాజాగా ప్రొద్దుటూరులో సర్వేలు చేస్తున్నది తెలంగాణా పోలీసులే అనే ప్రచారం ఊపందుకుంది. దాంతో అన్నీ పార్టీల వాళ్ళు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై 1వ వార్డుకు చేరుకుని రెండు బృందాలను అడ్డుకున్నాయి.  వాళ్ళతో మాట్లాడిన పోలీసులు వారి దగ్గరున్న గుర్తింపుకార్డులను తీసుకున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత హైదరాబాద్ లోని జెఎన్టియు, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్ధులుగా తేలాయి. తాము సర్వేలు నిర్వహించటానికి అవసరమైన ముందస్తు అనుమతి పత్రాలను కూడా బృందాలు చూపాయి. దాంతో పోలీసులు కూడా ఏమీ మాట్లాడలేకపోయాయట. సర్వేలు చేసుకుని జాగ్రత్తగా వెనక్కు వెళ్ళిపోవాలని పోలీసులు బృందాలను హెచ్చరించి వదిలేశారట. మొత్తానికి తెలంగాణా ఎన్నికలు ఏపిలో హీట్ పెంచేస్తే రేపటి ఏపి ఎన్నికలు కూడా తెలంగాణాలో అంతకుమించి హీట్ పెంచేసే సూచనలే కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: