ఎడిటోరియల్ : ఇంత వ్యతిరేకతలో కూడా 6 సీట్లా ?

Vijaya

అధికారంలోకి వచ్చేస్తామని సంబరపడుతున్న ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఓ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగున్నరేళ్ళలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా తెలుగుదేశంపార్టీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 6 సీట్లు వస్తాయని తాజా సర్వే చెబుతోంది. సరే, జరుగుతున్న సర్వేలంతా నిజాలవుతాయా ? అన్నది వేరే సంగతి. జనాల మూడ్ ఎలాగుందో తెలుసుకోవటానికి సర్వేలన్నవి ఓ మార్గం మాత్రమే. నిజానికి ప్రజల మూడ్ తెలుసుకోవటానికి సర్వేలకు మించిన మార్గం కూడా లేదనే చెప్పాలి.

 

నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై చాలా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే అనుకుందాం. అయినా 6 లోక్ సభ సీట్లలో గెలుస్తుందంటే ఏమనర్ధం ? 6 లోక్ సభ సీట్లంటే సుమారుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాలని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ప్రతీ పార్లమంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. సర్వే ఆధారంగా చూస్తే స్ధూలంగా టిడిపికి 42 అసెంబ్లీ నియోజకవర్గాలు దక్కుతాయని అంచనా వేసుకోవచ్చు. వైసిపి అనుకుంటున్నట్లు చంద్రబాబుపై ఇంత వ్యతిరేకత ఉన్నాకూడా టిడిపి 42 అసెంబ్లీ సీట్లలో గెలుస్తుందంటే మామూలు విషయం కాదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు నాలుగో వంతు సీట్లు టిడిపికి దక్కుతాయంటే అసెంబ్లీల్లో వైసిపిని టిడిపి ఓ ఆటాడుకుంటుందనటంలో సందేహం లేదు.

 

వైసిపి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టిడిపికున్న కార్యకర్తల బలం మరే పార్టీకి లేదనటంలో సందేహం లేదు. అదే పరిస్ధితుల్లో మంచి వాగ్దాటి కలిగిన నేతలు కూడా చాలామందే ఉన్నారు. ఒక అంశంపై పై స్ధాయి నుండి క్రిందస్ధాయి వరకూ ఒకే మాటను పదే పదే చెప్పి జనాలను మభ్య పెట్టగలగటం టిడిపి ప్రత్యేకత. తాము చెబుతున్నది అబద్ధమైనా, అవాస్తవమైనా సరే దాన్నే నిజమని జనాలు భ్రమపడేట్లు టిడిపి ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయం ఇప్పటికే కొన్ని వందలసార్లు రుజువైంది. దానికంతటికీ కారణం ఏమిటంటే ? చంద్రబాబుకున్న అపారమైన మీడియా మద్దతు.

 

పోయిన ఎన్నికల్లో కూడా వైసిపినే గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. కానీ ఎన్నికల తర్వాత ఏమైంది ? ఫలితాలు ఎందుకు తేడా కొట్టింది ? ఎందుకంటే, వైసిపి శ్రేణుల నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్సే కారణం. ఎలాగూ అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ఉదాసీనతతో ఎలక్షనీరింగ్ ను నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితమే ఐదేళ్ళు ప్రతిపక్షం. రేపటి ఎన్నికల్లో కూడా జాగ్రత్త పడకపోతే సర్వేల్లో మాత్రమే గెలుస్తుంటుందన్న వాస్తవాన్ని నేతలు గ్రహించాలి. రాబోయే ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంతో జగన్ పాదయాత్ర చేశారనటంలో సందేహమే లేదు.

 

 అటువంటిది పాదయాత్ర  తర్వాత కూడా వైసిపికి 19 ఎంపి సీట్లే వస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే పాదయాత్ర మధ్యలో ఉన్నపుడు మొదలైన సర్వేల నుండి ఇప్పటి దాకా చూస్తే వైసిపికి వస్తుందని అనుకుంటున్న సీట్ల సంఖ్య 19 నుండి పెరగలేదు. రాబోయే ఎన్నికలను తమపార్టీ స్వీప్ చేస్తుందని వైసిపి చేప్పటంలో అర్ధం లేదు. ఎలాగంటే స్వీప్ చేయటమంటే 25కి 25 పార్లమెంటు స్ధానాల్లోను గెలవటమే. పోయిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లను టిడిపి, బిజెపిలే గెలుచుకున్నాయి. అంటే వైసిపికి ఒక్కసీటు కూడా రాలేదు. అది స్వీప్ చేయటమంటే. కాబట్టి చంద్రబాబును తక్కువ అంచనా వేసుకుని వైసిపి నేతలు సంబరాలు మొదలుపెడితే బోర్లా పడక తప్పదని గ్రహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: