ఆ ఇద్దరు ఎమ్మెల్యేల జంపింగ్‌ పై హాట్ హాట్ చర్చ..?

Chakravarthi Kalyan

తెలంగాణలో ఇప్పుడు జంపింగ్‌ల సీజన్ నడుస్తోంది. అటు ఎన్నికల ఫలితాలు ముగిశాయో లేదో.. అప్పుడే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, టీడీపీ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.



టీడీపీ నుంచి కూడా వలసలు ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా జంప్ చేస్తారని హాట్ హాట్ చర్చ నడుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి ఆయనకు స్వాగతం పలకడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.



ఐతే.. తాము టీఆర్‌ఎస్‌లో చేరడం లేదని కేవలం ముఖ్యమంత్రిని గౌరవపూర్వకంగా కలవడానికే వెళుతున్నామని వారు ముందుగానే ప్రకటించడం విశేషం. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు కేసీఆర్ వచ్చినప్పుడు అక్కడ వారు ఆయనకు స్వాగతం పలికారు.శ్రీధర్‌బాబు పూలబొకే ఇవ్వగా.. వెంకటరమణారెడ్డి సీఎంకు శాలువా కప్పారు.


ఈ ఎమ్మెల్యేలు తాము టీఆర్‌ఎస్‌ లో చేరబోమని ఎంతగా చెబుతున్నా.. రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ ఆగడం లేదు. గతంలో సీఎం ఎన్నోసార్లు జిల్లాకు వచ్చినా స్వాగతం పలకని నేతలు ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా స్వాగతం పలికారన్నది వారి వాదన. మరి వీరు నిజంగానే స్వాగతం పలికేందుకు మాత్రమే వెళ్లారా.. లేక జంపింగ్ కు ఇది ముందస్తు సంకేతమా అన్నది కొన్నిరోజులు ఆగితే కానీ తేలదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: