గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు, తెలంగాణా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పకే విడుదలైన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో తన విజయం సంపూర్ణం చేసుకుంది. కాగా, కొడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు.


ప్రజా కూటమి ధారుణ పరాభవానంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, కాంగ్రెస్, ప్రజాకూటమి ఓటమికి కారణాలు ఏమిటనేది కూలంకుషంగా సమీక్షించి, విశ్లేషించుకొని తమ పార్టీని సంస్కరించుకుంటామని కుంటామని చెప్పారు.

"ఫలితాలపై చంద్రబాబునే బాధ్యుడ్ని చేయడం సరికాదు. పార్టీ నాయకులతో కూర్చొని ఫలితాలపై పూర్తిస్థాయి విశ్లేషణ చేస్తాం. ఎన్నికల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా, టీఆర్ఎస్ ఏమైనా గోల్-మాల్ చేసిందా అనేది చర్చిస్తాం" అని ఈ సమయంలోనూ చంద్రబాబుని సమర్ధించారు. 


రిజల్ట్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య ఉంటుందని, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందని ఒక బలమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.  "నేను క్షేత్రస్థాయిలో ఉంటాను. ప్రజలతో మరింత మమేకమైపోతాను. ప్రజాసమస్యల్ని ఎత్తిచూపుతాను. ఓడిపోతే కుంగిపోవడం మా పార్టీ రక్తంలో లేదు. గెలుపోటములు ఒకేలా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తాం. ఏదేమైనా కేసీఆర్ ఈ గెలుపును రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇచ్చిన లైసెన్స్ గా భావించకూడదు. కుటుంబ పెత్తనానికి, ఆధిపత్యానికి పట్టంకట్టినట్టు భావించొద్దు." అని రేవంత్ హైరేంజ్ లో వ్యాఖ్యానించారు.

ఇందిరాగాంధీ, ఎన్.టి.రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పి.వి.నరసింహారావు వంటి ఉద్ధండపిండాలు కూడా ఓడిపోయారన్నారు. అలాగే జయకేతనాలు ఎగరేశారు కూడా! ఫలితాలు ఎట్లా ఉన్న ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం. ప్రతిపక్షంలో మా బాధ్యత ఇంకా పెరుగుతుంది" అని పేర్కొన్నారు.


"తక్షణమే అమరవీరుల కుటుంబాలను గుర్తించండి. మొట్ట మొదటి శాసనసభలో మనం చేసిన తీర్మానాన్ని అమలు చేసే విధంగా, ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తి వేసే విధంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులు చదువు కోవటానికి సముచితమైన అవకాశాలు కల్పించే విధంగా రైతుల ఆత్మహత్యలు ఆగిపోయే విధంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా ఫామ్‌ హౌస్‌లో బందీ అయిన పరిపాలనను సచివాలయానికి తీసుకురావలసిందిగా సూచిస్తున్నా" అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: