జేడీ ‘లోక్ సత్తా’తో కలవబోతున్నారా!

siri Madhukar
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల గోల మొదలైంది.  వచ్చే నెల తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఏపిలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఏపిలో అన్ని పార్టీ నాయకులు తమ ప్రచారాలు అప్పుడే మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.  ఆ పార్టీకి ఏ పేరు పెడతారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.  జేడిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన ఆయన జేడీ (జన ధ్వని) కలిసి వచ్చేలా పార్టీ పేరు పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు ‘వందేమాతరం’ అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.

ఈ మేరకు ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు కూడా అందినట్టు చెబుతున్నారు.  వాస్తవానికి నిన్న తన పార్టీ పేరు వెల్లడిస్తారని అందరూ భావించారు.   అయితే కొత్త పార్టీని ప్రారంభించాలన్న ఆలోచన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.  ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే జయప్రకాశ్ నారాయణ స్థాపించిన ‘లోక్‌సత్తా’ పార్టీకి త్వరలోనే లక్ష్మీనారాయణ అధ్యక్షుడు అవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.   

నేడు హైదరాబాద్‌ పబ్లిక్ గార్డెన్స్‌లోని ప్రియదర్శిని హాల్‌లో జరగనున్న సమావేశం అనంతరం దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త పార్టీని ఏర్పాటు చేసి దానిని నడిపించడం కంటే ఉన్న పార్టీని మరింత బలోపేతం చేయడమే మేలని భావించిన ఆయన తనలాంటి భావజాలమే కలిగిన జయప్రకాశ్ నారాయణతో సంప్రదింపులు జరిపారు.  గత కొంత కాలంగా లోక్ సత్తా అన్ని వర్గాల్లో ఒక ఆలోచన రేకెత్తించింది. 

జయప్రకాశ్ నారాయణ ఐఏఎస్ అధికారి అయినా రాజకీయాల్లో జరుగుతున్న అవకతవకలు రూపమాపడానికి కొత్త పార్టీని స్థాపించారు.  కానీ అనుకున్న స్థాయిలో దాన్ని విజయపథం వైపు నడిపించలేక పోయారు.  ఈ నేపథ్యంలో లోక్‌సత్తా పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని జయప్రకాశ్ కోరినట్టు సమాచారం. ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యతల్లో తాను వ్యవహరిస్తానని జేపీ చెప్పినట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: