సమర శంఖనాదంతో కెటీఅర్-సింహనాదంతో రేవంత్ సవాలుకు ప్రతి సవాల్

కె టి ఆర్ - రేవంత్ రెడ్డి, జోడెద్దుల కుమ్ములాట నేటినుండి తారస్థాయికి చేరనుంది. ఎన్నికల సమరాంగణంలో బరిలో నిలిచేదెవరో నిన్న నిర్ణయం అవటంతో నేటి నుండి ప్రచార హోరుతో తెలంగాణా రాష్ట్రం తడిసి-ముద్దై పోనుంది. అదీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబతో ప్రత్యేకించి తండ్రీకొడుకులను రెవంత్ రెడ్డి "ఢీ కొట్టు" సందర్భాలు జనాన్ని ఆకర్షించటం గ్యారెంటీ.  

"తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకు పోయేదేమీ లేదని, హాయిగా ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటాను" అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్ ప్రచారసభలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. "కేసీఆర్ తన ఓటమిని ముందే గ్రహించి ఈ వ్యాఖ్యలు చేశారు" అని మహాకూటమి నాయకులు పేర్కొంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో కాస్త ఘాటుగానే స్పందించారు.  

తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ఇంటికి పోతాననడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శమని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి ధర్మాన్ని నెరవేర్చవచ్చు కదా! అని రేవంత్ సూచించారు. కానీ వారు ఆ పని చేయడానికి సిద్దంగా లేరని, కేసీఆర్ ఇంటికి, కేటీఆర్ అమెరికాకు పోతానంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో లేకపోతే ప్రజలకు సేవ చేయరా? అంటూ రేవంత్ వారిని ప్రశ్నించారు. 

నాలుగున్నరేళ్ల పాలనలో కేటీఆర్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు రేవంత్ ఆరోపించారు. అందువల్ల ఎక్కడ తన ఆర్థిక నేరాలు బైటపడిపోతాయేమోనని పారిపోయేందు కు ముందుగానే పథకం రచించాడని పేర్కొన్నారు. అందువల్ల ఆయనపై "రెడ్ కార్నర్ నోటీసులు" జారీ చేసి, పాస్-పోర్టును స్వాదీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ సూచించారు.

తండ్రీ కొడుకులిద్దరు బిల్లా-రంగాల వంటివారని రేవంత్ ఘాటు విమర్శలకు దిగారు. కొడంగల్ లో తనకు సవాల్ విసిరిన కేటీఆర్ కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. రానున్న లోక్-సభ ఎన్నికల్లో మహబూబునగర్‌ స్థానంలో ఇద్దరం పోటీపడి ఎవరి దమ్ము ఎంటో తేల్చుకుందామని, అందుకు కేటీఆర్ సిద్దమా? అంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు. 

"తెరాస అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ చేస్తున్నారు. దమ్ముంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఇద్దరం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం. ఎవరు ఓడిపోతే వారు రాజకీయ సన్యాసం తీసుకుందాం" అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రతిసవాల్‌ తో సమర నినాదమే చేశారు. నేడు మేడ్చల్‌లో సోనియాగాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ సభ ఏర్పాట్ల తోనే తెరాస లో వణుకు పుట్టిందని, "కాడి పడేసి తప్పుకొనే మాటలు" మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కొడంగల్‌ను దత్తత తీసుకుని మరో సిరిసిల్లగా మారుస్తానంటున్న కేటీఆర్‌, ఏనాడైనా అక్కడి ప్రజలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేటీఆర్‌ చోద్యం చూశారని విమర్శించారు. ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకున్న నేరెళ్ల వాసులను జైల్లో పెట్టించి హింసించిన ఘనత కేసీఆర్‌-కేటీఆర్‌ ద్వయందేనన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: