ఎడిటోరియల్: తనను తాను ఎక్కువ అంచనా వేసుకుంటున్నారా ?

Vijaya
సమస్యంతా చినబాబు నారా లోకేష్ ఆలోచనా విధానంలోనే ఉన్నట్లుంది. నిజానికి పార్టీలో చాలామంది నేతలతో పోల్చుకుంటే లోకేష్ ఏ విషయంలో కూడా అధికుడు కాదు. కానీ చిక్కేంటంటే ఇతరులకన్నా తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు కొడుకు కావటమే అందుకు ప్రధాన కారణం. తనను తాను ఎక్కువ అంచనా వేసుకున్నా పెద్దగా సమస్య ఉండకపోను.  కానీ ఎదుటివాళ్ళని తక్కువ అంచనా వేయటమే  సమస్యగా మారుతోంది.


జిల్లాలో చిచ్చు అంతా ఇంతా కాదు


తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు. ఏదో ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళిన లోకేష్ కార్యక్రమాన్ని చూసుకుని వెనక్కు రాకుండా రెండు టిక్కెట్లను ప్రకటించారు. అదికూడా జిల్లా పార్టీలో ఇంకెవరూ నేతలు లేనట్లుగా కర్నూలు ఎంపి, ఎంఎల్ఏలుగా ఫిరాయింపులైన  బుట్టా రేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. దాంతో జిల్లా పార్టీలో  అగ్గిరాజుకుంది.  ఎంఎల్ఏగా వచ్చే ఎన్నికల్లో తన కొడుకు టిజి భరత్ ను పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్న రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కు లోకేష్ ప్రకటనతో పిడుగుపడ్డట్లైంది. దాంతో రెండు రోజులుగా  లోకేష్ పై టిజి మండిపోతున్నారు.


చంద్రబాబు వల్లే కావటం లేదు


నిజానికి లోకేష్ ఏమీ డక్కా మొక్కీలు తిని ఎంఎల్సీ అయి మంత్రికాలేదు. చంద్రబాబు కొడుకు అనే అర్హతతో  ఎంఎల్సీ అయి ఏకంగా మంత్రి పీఠమెక్కారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా ఒకవైపు చంద్రబాబు తల బొప్పి కడుతోంది. చాలా జిల్లాల్లో పలువురు నేతల మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలున్నమాట వాస్తవం. నేతలను ఎన్నిసార్లు కూర్చోపెట్టుకుని పంచాయితీలు చేస్తున్నా నేతల మధ్య  సర్దుబాటు కావటం లేదు. దాంతో చాలా జిల్లాల్లో నేతలను చంద్రబాబు కూడా వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వాదిలేశారు. 


చేతులెత్తేసిన చంద్రబాబు


అనంతపురం జిల్లాలో పరిటాల-వరదాపురం సూరి, కర్నూలు జిల్లాలో భూమా -ఏవి సుబ్బారెడ్డి, ఎస్వీ-టిజి వెంకటేష్,  ప్రకాశం జిల్లాలో కరణం-గొట్టిపాటి రవి,  విశాఖపట్నం జిల్లాలో చింతకాయల-గంటా, శ్రీకాకుళం జిల్లాలో కింజరావు కుటుంబంలోనే గొడవలు, విజయనగరం జిల్లాలో అశోక్-సుజయ కృష్ణ రంగారావు,  తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల-బొడ్డు, కృష్ణా జిల్లాలో వంశీ-దేవినేని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జిల్లాలోని  పలువురు నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళమధ్య విభేదాలను పరిష్కరించలేక చంద్రబాబే చేతులెత్తేశారు. అటువంటిది లోకేష్ చర్యలు నేతల మధ్య చిచ్చు మరింత పెంచేవిగా కనిపిస్తోంది. తాజాగా కర్నూలు పర్యటనలో లోకేష్ చేసిందదే. లోకేష్ ఒక్క జిల్లాలో పర్యటిస్తేనే  అంత చిచ్చు రేగింది. ఇక అన్నీ జిల్లాల్లో పర్యటనలు చేస్తే ... 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: