పవన్ కళ్యాణ్ కు ఏమైంది..? ఎందుకిలా చేస్తున్నారు..?

Vasishta

పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ అధినేతగా నాలుగేళ్లుగా రాజకీయ హడావుడి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో అవసరాల దృష్ట్యా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చానన్న పవన్.. ఇప్పుడు మాత్రం ఆ తప్పు చేయనంటున్నాడు. మరి ఆయన ఏం చేయబోతున్నాడు.


          జనసేన పార్టీ పెట్టి నాలుగేళ్లయినా జనసేనాని ప్రజలను ప్రభావితం చేసే ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయారు. అయితే ఇంకా ఎన్నికలు ఏడాది ఉన్న సమయంలో ప్రజల్లోకి వచ్చి తాను కూడా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించదలచుకున్నానని ప్రకటన చేసి ఆ దిశలో పయనం సాగిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం-వైసీపీ మధ్యే పోటీ అని భావించిన ప్రజలకు తాను కూడా రంగంలో ఉన్నానని... ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని ప్రకటన చేసి రంగంలో నిలబడ్డారు పవన్ కల్యాణ్..


2014 ఎన్నికల్లో ఓట్లు చీలడం ఇష్టం లేదంటూ... టీడీపీ-బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన పవన్... ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోననీ.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తామని చాలా రోజుల ముందే పవన్ ప్రకటించారు. అయినా... జనసేనపై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఇప్పటివరకూ సంస్థాగత నిర్మాణం లేని జనసేన.. 2019 ఎన్నికల్లో నిజంగానే పోటీ చేస్తుందా?  పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బరిలోకి దిగుతుందా? ఇలా ఎన్నో జవాబు లేని ప్రశ్నలు చక్కర్లు కొట్టాయి.


జనసేన ప్రకటనల బట్టి వామపక్షాలతో కూడా జనసేన పొత్తు అనుమానమే. ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమే. సొంతంగా పోటీ చేస్తామనే పేరుతో ఒంటరి పయనం ఓట్లు చీల్చడానికే తప్ప సీట్లు సాధించడానికి పనికిరాదన్న చర్చ కూడా జరుగుతోంది. అప్పట్లో ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ కూడా సింగిల్ గా వెళ్లి చతికిలపడిన అనుభవాలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. వాటిని పునరావృతం చేస్తే పవన్ స్వయంకృతాపరాధమే అవుతుంది.


జనసేన పార్టీకి, అధినేత పవన్ కల్యాణ్ కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల విషయంలో ఎలాంటి కొరత లేదు. దీనిపై ఎవరికీ సందేహాలు లేవు. అయితే వ్యవస్థాగత నిర్మాణం లేని జనసేన పార్టీ ఎన్నికలను ఎదుర్కొనే సత్తా కలిగి ఉందా అనే సందేహాలు అందరి మదిని దోస్తున్నది. అదే సమయంలో వ్యవస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉన్న వామపక్షాలను విస్మరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కూడా చర్చనీయాంశమైంది. ఓట్ల పరంగా పవన్ కి వామపక్షాల మూలంగా కలిగే ప్రయోజనాల మీద పలు సందేహాలు ఉండవచ్చు. కానీ ఒంటరిగా పోటీ చేయడం కన్నా, కొందరు మిత్రులతో కలిసి సాగడం ద్వారా కలిగే రాజకీయ ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు విస్మిరిస్తున్నారన్నది అంతుబట్టని ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: