కన్నా... ఇదేనా మీ చిత్తశుద్ధి..? ఇలాగైతే బీజేపీ పని అంతే..!!

Vasishta

ఓవైపు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసిందని ఆగ్రహావేశాలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారికి మరింత ఆజ్యం పోసే విధంగా కేంద్రం నుంచి మరో సంకేతం అందింది.  విభజనచట్టంలో పేర్కొన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఇది ఏపీలో బీజేపీకి ఏమాత్రం మేలు చేయని చర్య.


          ఆంధ్రప్రదశ్ లో టీడీపీతో దోస్తీ చెడిన తర్వాత బలపడేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతోంది. చంద్రబాబును దెబ్బకొట్టేందుకు బీజేపీ కన్నా లక్ష్మినారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆయన తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు బలోపేతానికి బీజేపీ నేతలంతా మూకుమ్మడిగా టీడీపీని టార్గెట్ గా చేసుకుని మాటలతూటాలు పేల్చుతున్నారు. టీడీపీ మాత్రం సింపుల్ గా కేంద్రం కించిత్ కూడా రాష్ట్రానికి చేయలేదని, కనీసం విభజనచట్టంలోని అంశాలను కూడా నెరవేర్చలేదని, యూసీలు ఇచ్చినా ఇవ్వలేదని అబద్దాలాడుతోందని ఆరోపిస్తోంది.  ఇవ్వనివాటి సంగతి అడుగుతుంటే ఇచ్చినవాటి సంగతేంటని బీజేపీ అనడం భావ్యం కాదంటోంది.


          టీడీపీ ఆరోపణలను ఎదుర్కోవడానికి, రాష్ట్రప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను పోగొట్టుకోవడానికి కేంద్రంలోని బీజేపీ కచ్చితంగా ఏపీకి ఇంతోకొంతో మేలు చేసి ఎన్నికలనాటికి ఓటర్లను కొంచెమైనా శాంతింపజేసే ప్రయత్నం చేస్తుందని చాలా మంది భావిస్తూ వచ్చారు. అయితే బీజేపీకి అలాంటి ఆలోచనేదీ లేనట్టు అర్థమవుతోంది. రాష్ట్రానికి సంబంధించి విభజనచట్టంలోని పెండింగ్ అంశాల్లో రెండు ప్రధాన అంశాలున్నాయి. అందులో ఒకటి విశాఖ రైల్వే జోన్ కాగా రెండోది కడప ఉక్కు ఫ్యాక్టరీ. అయితే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి తగినంత సానుకూలత లేదని కేంద్రం తేల్చిచెప్పింది.


          కడప, బయ్యారంలలో ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటును పరిశీలించాలని విభజనచట్టం పేర్కొంది. కేంద్రంలోని పెద్దలు కూడా కడప ఉక్కు ఫ్యాక్టరీకి సానుకూలంగా ఉన్నట్టు స్థానిక బీజేపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం... కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆలోచన లేదని తేల్చేసింది. మొదటి ఆరు నెలల్లోనే ఈ విషయాన్ని చెప్పేశామని కూడా పేర్కొంది. దీంతో బీజేపీ నేతల మాటలన్నీ ఒట్టివేనని తేలిపోయింది. మరి తాజా పరిణామాన్ని బీజేపీ నేతలు ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాలి. అయితే బీజేపీకి ఇది పెద్ద అశనిపాతం కాగా.. రాజకీయంగా టీడీపీకి మరో అస్త్రం ఇచ్చినట్టయింది. బీజేపీ వైఖరి ఇలాగే ఉంటే ఏపీలో ఆ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: