ఏపి: చిత్తూరు ఈ 3 సెగ్మెంట్లలో చిత్తయ్యేదెవరు.?

Pandrala Sravanthi
•చిత్తూరులో ఆ మూడు స్థానాలే కీలకం..
• డిప్యూటీ సీఎంను డాక్టర్ `ఢీ´ కొంటారా.?
• పూతలపట్టులో పట్టు ఎవరిది.?
ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య విపరీతమైన పోరు ఏర్పడింది. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో వైసీపీ సంక్షేమ పథకాలే బ్రహ్మాస్త్రంగా ముందుకు వెళుతుంటే, ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్న టిడిపి  కూటమి ప్రచార హోరులో దూసుకుపోతున్నారు. అలాంటి ఏపీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి 13 సీట్లు గెలుచుకున్న వైసిపి, ఈసారి క్లీన్ స్వీప్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అలాంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలపై రెండు పార్టీలు దృష్టిపెట్టాయి.  అవే సత్యవేడు, పూతలపట్టు, జీడి నెల్లూరు..  ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీలకు ఎక్కువ బలాలు ఉన్నాయి.. ప్రజలు ఏవైపు ఉన్నారు అనే వివరాలు చూద్దాం..
 సత్యవేడు:
ఈ నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది మండలాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో 2014లో టిడిపి విజయం సాధించింది.ఆ తర్వాత 2019లో వైసీపీ సక్సెస్ అయింది. 2014 ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంపై టిడిపి అభ్యర్థి తలారి ఆదిత్యా తారా చంద్రకాంత్ గెలుపొందారు. ఇక 2019 ఎలక్షన్స్ లో టిడిపి అభ్యర్థి జెడి రాజశేఖర్ పై వైసిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం గెలిచారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం ను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.  వైసిపి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆదిమూలం టిడిపిలో చేరి టికెట్ తెచ్చుకున్నారు.  దీంతో వైసీపీ అక్కడ రాజేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది.  అయితే టిడిపి నుంచి జెడి రాజశేఖర్ కు టికెట్ వస్తుందని భావించారు. అనూహ్యంగా  ఆదిమూలం ఎంట్రీ తో టికెట్ ఆయనకు వెళ్ళింది.  దీంతో టిడిపి పై అలిగినటువంటి రాజశేఖర్  వల్ల టిడిపికి కాస్త సపోర్ట్ తగ్గుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా వైసిపి అభ్యర్థి రాజేష్ ఎన్నారై కావడంతో ఆయన ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా వైసిపి, టిడిపి మధ్య విపరీతమైనటువంటి పోరు జరుగుతుంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టంగా మారింది.
 పూతలపట్టు:
 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా కే.మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. అలాగే వైసిపి అభ్యర్థిగా ఎం.సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. మరి వీరి యొక్క బలాబలాల విషయానికి వస్తే.. 2008లో ఈ ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఎస్సి రిజర్వుడ్ గా మార్చేశారుఈ . నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది. ఈ విధంగా అక్కడ టిడిపి మూడుసార్లు ఓడిపోయింది.  ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కలిసి రావడం లేదు. వైసీపీకి ఇది కంచుకోటలా మారింది. అలాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబు అభివృద్ధిపై అంత దృష్టి పెట్టకపోవడం, భాష రాకపోవడం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  దీంతో ఇక్కడ వైసిపి అభ్యర్థిగా ఎం సునీల్ కుమార్ ని బరిలో దించింది. HM tv రిపోర్టర్ ఎంతో ఫేమస్ అయినటువంటి మురళీమోహన్ ని టిడిపి బరిలో దించడంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు తిప్పుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో ఈసారైనా టిడిపి అక్కడ పట్టు సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.
 జీడి నెల్లూరు:
 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయినటువంటి జీడి నెల్లూరు నుంచి  టిడిపి అభ్యర్థిగా డాక్టర్ ఎం.వి థామస్ , అలాగే వైసిపి అభ్యర్థిగా కలత్తురు కృపా లక్ష్మి పోటీలో ఉన్నారు. మరి ఇందులో ఎవరికి  ఎంత బలముందో ఇప్పుడు చూద్దాం.. ఏపీలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడూ టిడిపిపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆయన అభివృద్ధి పట్టించుకోరు కానీ ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారని ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వద్దని నియోజకవర్గ నుంచి పార్టీ నాయకులు ధర్నాలు చేశారు. దీంతో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మిని రంగంలోకి దించింది వైసిపి.  దీంతో ఆమెకు దీటుగా థామస్ ను బరిలోకి దించింది టీడీపీ. అయితే థామస్ భార్య రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఇటు ఎస్సీ ఓట్లు, రెడ్డి ఓట్లు కలిసి వచ్చే అవకాశంగా భావిస్తున్నారు. అంతేకాకుండా నారాయణస్వామి పై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా టిడిపికి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.  ఈ నియోజకవర్గం ఈసారి టిడిపికి పట్టుగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: