కర్నాటక డెవలప్ మెంట్స్ పై చంద్రబాబు కామెంట్ ఏంటో తెలుసా..?

Vasishta

కర్నాటకలో యడ్యూరప్ప రాజీనామా ప్రజా విజయం అన్నారు సీఎం చంద్రబాబు. ఆయన రాజీనామా అందరికీ సంతోషం కలిగించిందన్నారు. ఆయన రాజీనామాపై సంతోషంగా ఉన్నారా.. అని సాధికారమిత్ర సభ్యులను ప్రశ్నించి వారితో ఎస్ అనిపించారు.


బీజేపీ రాష్ట్రానికో విధంగా వ్యవహరిస్తోందన్న చంద్రబాబు.. గోవాలో ఓ రకంగా, కర్నాటకలో మరో రకంగా వ్యవహరించిందన్నారు. అక్కడ అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా.. ఇక్కడ మాత్రం అవకాశం ఇచ్చిందన్నారు. అయితే కర్నాటకలో ప్రధాని, అమిత్ షా లాంటి అగ్రనేతలు రంగంలోకి దిగినా విఫలమయ్యారని చంద్రబాబు చెప్పారు. బలం లేకపోయినా గవర్నర్ అండతో యడ్యూరప్పతో ప్రమాణం చేయించారన్నారు. ఎన్నికల్లో కూడా ఓటుకు పదివేలు ఇచ్చారనే ఆరోపణలున్నాయన్నారు. ఆఖరికి ప్రోటెం స్పీకర్ గా సీనియర్ ను నియమించాల్సి ఉండగా.. దాన్ని కూడా అపహాస్యం చేశారన్నారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను అన్ని ఛానళ్లలో లైవ్ ఇవ్వాలని ఆదేశించి సుప్రీంకోర్టు మంచిపని చేసిందన్నారు.


ఏపీకి అన్యాయం చేసినవారిని మట్టి కరిపించాలని పిలుపునిచ్చానని చంద్రబాబు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని తెలుగువాళ్లకు పిలుపునిస్తే.. వాళ్లు అక్కడ బీజేపీని ఓడించారన్నారు. అందుకే కర్నాటకలో ఇప్పుడు బీజేపీకి ఈ పరిస్థితి ఎదురైందన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి అవినీతిపరులను బీజేపీ రంగంలోకి దింపి ప్రలోభాలకు తెరదీసిందన్నారు. వందకోట్లు ఇస్తాం.. లైఫ్ సెటిల్ చేస్తాం.. అంటూ ప్రలోభాలకు పాల్పడ్డారన్నారు. ప్రధాని లాంటి జాతీయ నేతలే అవినీతిని ప్రోత్సహిస్తే ఇక.. యువతకు ఎలాంటి సందేశమిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నాటక తర్వాత మనపై పడాలని ఆరాటపడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు.


          ఇప్పటికే తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీజేపీని దుయ్యబట్టారు చంద్రబాబు. కర్నాటకలో ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఆందోళన కనిపించిందన్నారు. అయితే ఈరోజు ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. అందుకే తాను కర్నాటకపై స్పందిస్తున్నానన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి.. చివరకు తన పుట్టినరోజు నాడే ధర్నా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారన్నారు బాబు. ఏపీకి న్యాయం చేయాలంటే ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కర్నాటక ప్రజలు బీజేపీని తిరస్కరించి మంచి పని చేశారన్ని చంద్రబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: