పోలవరం..బాబు తడబాటు వెనుక అసలు రహస్యం..!?

Chakravarthi Kalyan
పోలవరం ప్రాజెక్టు.. ఆంధ్రుల ఆశాజ్యోతి.. ఇది పూర్తయితే దాదాపు 5 జిల్లాల్లో సిరులు పండుతాయి. దశాబ్దాల నుంచి  పెండింగులో ఉన్న ఈ ప్రాజెక్టులో ఇప్పుడు కదలిక వచ్చింది. పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు 50 శాతం వరకూ పూర్తయ్యాయని రాష్ట్రం చెబుతోంది. ఈ దశంలో కేంద్రంతో చంద్రబాబు కటీఫ్ చెప్పడంతో ఈ ప్రాజక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 



దీనికితోడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్రం తీసుకున్న అంశంపైనా వివాదాలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని పవన్ కల్యాణ్ వంటివారు గళం విప్పుతున్నారు. దీంతో చంద్రబాబు ఒత్తిడికి లోనవుతున్నారు. గతంలో ఆయన ఈ ప్రాజెక్టును తాను అడిగి తీసుకున్నానని పలుసార్లు మీడియా ముందు చెప్పారు. 


కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట మారుస్తున్నారు. తాము అడగలేదని.. రాష్ట్రం చేస్తే బావుంటుందని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే నిర్మాణ బాధ్యతను తమకు అప్పగించారని చంద్రబాబు అంటున్నారు. మరి ఇలా మాట మార్చడం వెనుక అసలు రహస్యం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. గతంలో కేంద్రం రాసిన లేఖల్లో రాష్ట్ర విజ్ఞప్తిపైనే పోలవరం రాష్ట్రానికి ఇస్తున్నామని ఉన్న విషయాన్ని కొన్ని పత్రికలు కోట్ చేస్తున్నాయి.



అసలు పోలవరం టెండర్ల విషయంలో వచ్చిన విబేధాలే చినికి చినికి గాలివానగా మారి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేశాయన్న వాదన కూడా ఉంది. పోలవరం పనుల్లో భారీ అవినీతి జరుగుతోందని.. ఈ విషయం కేంద్రం వరకూ వెళ్లడం వల్ల.. వారు జోక్యం చేసుకున్నారని.. అది నచ్చకపోవడం వల్లే చంద్రబాబు కేంద్రంపై అసంతృప్తి పెంచుకున్నారని అంటున్నారు. మరి లోగుట్టు పెరుమాళ్లకెరుక..!?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: