విశాఖలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు..? రికార్డ్ ఖాయమా..?

Vasishta

సీఎం చంద్రబాబు ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ ను అన్నింటా ముందు నిలబెట్టేందుకు సీఎం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సీఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగేళ్లలో 3 భాగస్వామ్య సదస్సులు ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ గొప్పదనం.


మూడు రోజుల పాటు విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ సదస్సుకి 40 దేశాలకి చెందిన ప్రతినిధులతో పాటు, 15 దేశాలకి చెందిన వాణిజ్య మంత్రులు హాజరవుతున్నారు. తొలిరోజు సెషన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పాల్గొననున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 


విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి 26 తేదీ వరకు  మూడు రోజుల పాటు సీఐఐ సదస్సు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ఆస్ట్రేలియా, కంబోడియా, బంగ్లాదేశ్, కొరియా, శ్రీలంక, స్పెయిన్, నార్వే.. తదితర దేశాలకి చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరితోపాటు దేశవిదేశాలకు చెందిన వాణిజ్య రంగాల ప్రముఖులు, పలువురు మంత్రులు సదస్సుకు రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగంలో వచ్చిన పరిణామాలపై చర్చించనున్నారు. టూరిజం, ఏరోస్పేస్, రక్షణ, టెక్స్ టైల్స్, విద్యుత్ పునరుద్ధరణ, ఫుడ్ ప్రాససింగ్, మెడికల్ ఎక్విప్ మెంట్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై నిపుణులు సలహాలు ఇవ్వనున్నారు.


వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానుండటంతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయిస్తున్నారు. వసతి, భోజనం, ప్రాంగణంలో సౌకర్యాలు, రవాణా సదుపాయాలు ఇలా ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యత అప్పగించారు. పనిలోపనిగా విశాఖ టూరిజాన్ని విదేశీ ప్రతినిధులకి ప్రతిరోజూ సాయంత్రం పూట చూపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సదస్సు ప్రాంగణంలో 78 CC కెమెరాలు, 7 చెక్ పోస్టులతో పాటు.. 800 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.


ఆంధ్రప్రదేశ్ లో మూడోసారి ఈ భాగస్వామ్య సదస్సుని నిర్వహించనుండటంతో.. పలువురు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఖాయమని AP చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్రకి ఎక్కువగా మేలు జరుగుతుందని చెప్పారు. గత సదస్సులతో పోల్చితే ఈసారి మరిన్ని పెట్టుబడులు ఖాయమని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండడం రాష్ట్రానికి కలిసొస్తున్న అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: