మధ్యయుగాలకాలం నాటి పరిస్థితుల్లోకి భారత్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన యువ నాయకుడు రాహుల్ గాంధీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ పై, అధికార బీజేపీలపై విమర్శలతో చెలరేగి పోయారు.  మన్మోహన్ కాలంలోనే కాంగ్రెస్ భారత దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళితే నరెంద్ర మోదీ అధికారం లోకి వచ్చి మళ్ళీ దేశాన్ని మధ్యయుగాల కాలం లోకి  తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ దేశాన్ని తిరోగమన పథం లో నడుపుతున్నారని విమర్శించారు.



కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోందని, కానీ తాము  కమలం పార్టీని కలుపుకొనే దేశాన్ని పురోగామి పథం లోకి నడిపించాలని ప్రయత్నిస్తున్నా మన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ హింసను బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని రాహుల్ ఆరోపించారు.




దేశ ప్రజల పట్ల నమ్మకం తోనే 13 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టానని రాహుల్ గాంధి తెలిపారు. ప్రస్తుత రాజకీయాలు ప్రజాసేవకు ఉపయుక్తంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను సోదరులుగా, సోదరీమణులుగా భావిస్తాం. వారిని గౌరవిస్తాం, కానీ వారితో ఏకీభవించమని రాహుల్ గాంధి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇతరులను నిందించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీని నిలువరించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమేనని రాహుల్ గాంధి తెలిపారు.



కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నేడే సంపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. తన తల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గా 19 సంవత్సరాలు నిరవధికంగా బాధ్యత వహించిన సోనియా గాంధీ నుంచి ఆయన పార్టీపగ్గాలను చేపట్టారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.  పార్టీ అధినేతగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్ గాంధి శనివారం ఉదయం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు.



కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీకి సోనియా అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధి సారథ్యంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె కాంగ్రెస్ శ్రేణులను కోరారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధిల హత్యలను సోనియా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందిరా గాంధి తనను సొంత కూతురిలా చూసుకునే వారని తెలిపారు.



రాహుల్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ప్రత్యేకమైందని తెలిపారు. 19 ఏళ్ల పాటు పార్టీని ముందుకు నడిపిన సోనియా గాంధీపై మన్మోహన్ ప్రశంసలజల్లు కురిపించారు. కాంగ్రెస్ హయాంలో దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: