ఎన్టీఆర్ వర్ధంతి తర్వాత తెలంగాణ టీడీపీలో ఏం జరగబోతోంది..?

Vasishta

తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టి పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర కాలమే ఉండటంతో తెలంగాణ రాజకీయాలపై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయిస్తానని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి నుంచి తెలంగాణలో పార్టీ కార్యాక్రమాలపై పూర్తిస్థాయి దృష్టిసారించేందుకు బాబు కార్యాచరణ రూపొందించారు.


తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల అనంతరం తెలంగాణలో మూడో స్థానానికి చేరిన సైకిల్ పార్టీ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం ఒక్కస్థానమే గెలిచింది. ఈ మధ్యలో పార్టీలోని సీనియర్ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేయడంతో ఎన్టీఆర్ భవన్ దాదాపు ఖాళీ అయ్యింది.


మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నందున తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బాబు దృష్టి సారించారు. తెలంగాణలో ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇకపై ప్రతి గురువారం తెలంగాణ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీకి సంబంధించిన సమస్యలను తనకు ఎప్పటికప్పడు వివరించాలని సూచించారు.


ప్రస్తుతం పలువురు నేతలు పార్టీలు మారడంతో చాలా నియోజకవర్గాలకు నాయకులు లేకుండా ఖాళీగా ఉన్నాయి. నెల రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల నియామకం జరగాలని టీటీడీపీ నేతలను బాబు ఆదేశించారు. అదేవిధంగా త్వరలో నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు..


లోకసభ, అసెంబ్లీ నియోజకవర్గలకు పార్టీ ఇంఛార్జ్ లను నియమించాలని బాబు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు 40మంది సీనియర్ నాయకులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు జనవరి 18వ తేదీ నుంచి మార్చి 29 పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక బాబు టీటీడీపీ నేతలతో ప్రతినెలా విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతుందని స్పష్టం చేశారు..


ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ బలోపేతంపై మాత్రమే దృష్టి పెట్టాలని, పొత్తులపై ఇప్పుడు చర్చ అనవసరం అని నేతలకు సూచించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్నట్లుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని బాబు సూచించారు. పార్టీలో చేరేందుకు ఇప్పటికీ కొంత మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారని బాబు చెప్పారు. టీడీపీ చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచే ఉంటుందని బాబు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని బాబు సూచించారు. మరో ఏడాది కాలం ఉండటంతో తెలంగాణలో పార్టీకి పుర్వ వైభవం తీసుకువచ్చేందుకు బాబు తీవ్రంగా కృషి  చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: