టీడీపీ + వైసీపీలో రాజ‌కీయ వార‌సుల లెక్క ఇదే...

VUYYURU SUBHASH
సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో సంవ‌త్స‌రంన్న‌ర స‌మ‌యం ఉంది. అయితే ఇప్పుడే రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే రాజ‌కీయ వార‌సులు తెర‌పైకి వ‌స్తున్నారు. టీడీపీ కొత్త‌త‌రం నేత‌ల‌కు ఆహ్వానం ప‌లికేందుకు సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల ర‌వి వార‌సుడు ప‌రిటాల శ్రీరామ్ రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త‌న త‌న‌యుడిని రాఫ్తాడు లేదా పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ? ఎక్క‌డో ఓ చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు మంత్రి సునీత స్కెచ్ గీస్తోంది. ఇక జిల్లాలో తనయులకు తమ రాజకీయ వారసత్వం అప్పగించేందుకు చాలామంది నేతలు కూడా తగిన వ్యూహాలు వేస్తున్నారు.  రాజకీయాల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి ?  ప్రజాదరణ ఎలా పొందాలి, ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలనే అంశాలను దగ్గరుండి నేర్పిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తపనపడుతున్న వారసుల్లో చాలామంది అధికార పార్టీకి చెందినవారే.


అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన తనయుడు పవన్‌కుమార్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని జేసీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకువస్తానన్నారు. ఇక తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సైతం తన తనయుడు అస్మిత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తానికి జేసీ బ్రదర్స్‌ ఇద్దరూ తమ తనయులను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించనుండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 


అలాగే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కూడా తన తనయుడు మారుతిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. మారుతి ఇప్పటికే క్రీయాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హ‌న్మంత‌రాయ చౌద‌రికి వ‌య‌స్సు పైబ‌డ‌డంతో ఆయ‌న త‌న‌యుడిని రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయించేందుకు రెడీ అయిపోయారు. ఇక హిందూపురం పార్లమెంట్‌ సభ్యుడు నిమ్మల కిష్టప్ప సైతం వచ్చే ఎన్నికల్లో తన తనయుడు నిమ్మల శిరీష్‌ను ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ఆయ‌న పెనుగొండ‌, పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాల మీద క‌న్నేశారు.


ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష వైసీపీ నుంచి పోటీ చేసేందుకు కొనకొండ్ల భీమిరెడ్డి సిద్దమయ్యారు. ఈయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కొనకొండ్ల శివరామిరెడ్డి తనయుడు... మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డికి స్వయానా మేనల్లుడు. దీంతో ఈయనకు రాజకీయంగా మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి మరింత మంది రాజకీయ వారసులు రంగం లోకి దిగే ఛాన్స్ కనబడుతోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: