ఇక తమ్ముళ్లకు పదవుల పండగ..!

Vasishta

తెలుగుదేశం పార్టీలో నామినేషన్ పోస్టుల భర్తీకి వేళయ్యింది. పార్టీకి ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ అధినేత నడుం బిగించారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే నామినేషన్ పదవులను బాబు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఆశావాహులంతా తమ శక్తి మేరకు కృషి చేస్తున్నారు..

 

నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేకపోగా... అభిమానం పెరిగిందనేది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఎన్నో ఏళ్లుగా అసంతృప్తితో ఉన్న సీనియర్లను బుజ్జగించేందుకు అధినేత నడుం బిగించారు. సాధారణ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో నామినేటెడ్ పదవులను భర్తీ చేసి వాటి ద్వారా లబ్ది పొందాలని బాబు భావిస్తున్నారు..


రాష్ట్ర విభజన అనంతరం పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రులతో పాటు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కని సీనియర్లు తమకు గుర్తింపు దక్కడం లేదని కొంత అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పదవులతో వారిని బుజ్జగించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనేది చంద్రబాబు భావన. మిషన్ 2019 పేరుతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని బాబు ఆలోచిస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే... సీనియర్ నేతలకు పదవులు ఇవ్వడం ద్వారా ఆయా సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించవచ్చని బాబు భావిస్తున్నారు.


నామినేటెడ్ పదవుల జాబితాలో రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముందు వరసలో ఉన్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత శాసనమండలి పదవి వస్తుందని భావించినప్పటికీ ఆ అవకాశం దక్కలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం సోదరులు కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే.. ఇటీవలే చంద్రబాబు అనంకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


అలాగే బీసీ వర్గానికి చెందిన నేత బీద మస్తాన్ రావు కూడా నామినేటెడ్ పదవుల రేసులో ముందువరుసలో ఉన్నారు. పార్టీ గడ్డుకాలంలో కూడా అండగా ఉన్న మస్తాన్ రావుకు పదవి దక్కుతుందని ఇప్పటికే పార్టీలో ప్రచారం మొదలైంది. అలాగే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే చర్చ మొదలైంది. ఎండీ అమరేంద్రను మార్చిన నేపథ్యంలో అధికారుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఛైర్మన్ ను కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండేళ్లుగా ఈ పదవిలో ఉన్న చలమలశెట్టి రామానుజయను పదవి నుంచి తప్పించి మరొకరికి అవకాశం కల్పించే యోచనలో బాబు ఉన్నారు. అటు ముద్రగడ వ్యవహారం నేపథ్యంలో ఈ పదవిని కోస్తా ప్రాంతానికి చెందిన నేతకు ఇచ్చే అవకాశం ఉంది. జ్యోతుల నెహ్రూ, కొత్తపల్లి సుబ్బారాయుడు, చిక్కాల రామచంద్రరావులలో ఒకరికి అవకాశం దక్కనుంది..


ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఇప్పటికే ఖాళీగా ఉన్న నామినేటెడ్ స్థానాల భర్తీ పై ప్రభుత్వం దృష్టి సారించింది. పార్టీలో కీలక నేతలకు పదవులు కట్టబెట్టడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని బాబు భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానాల పెంపు అవకాశం లేకపోవడంతో నామినేటెడ్ పదవుల ద్వారా అసంతృప్తులను బుజ్జగించవచ్చని పార్టీ నేతల ఆలోచన. ఆర్టీసీ, టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవులతో పాటు మరికొన్ని కీలక కార్పొరేషన్లకు కూడా నూతన బోర్డులు నియమించాలని బాబు సర్కారు భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: